ప్రొఫెసర్ హరగోపాల్ పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. అయితే, ప్రొఫెసర్ హరగోపాల్ పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేయడాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే సాకుతో తాడ్వాయిలో ఆయనపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉన్నదన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర్ ప్రభుత్వం నక్సలైట్ చర్చలు జరిపేందుకు ఆయన మధ్యవర్తిత్వం వహించారని, గతంలో పలు సమస్యలు తలెత్తినప్పుడు కూడా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు నక్సల్స్ సంప్రదింపులు జరిపారని గుర్తు చేశారు.
ప్రజాస్వామిక వాదియైన ప్రొఫెసర్ హరగోపాల్ పోలీసులు కేసు పెట్టడం అన్యాయమని, ఆయనతో పాటు ప్రొఫెసర్ పద్మజా షా, తదితరులపై కారణం లేకుండా కేసులు పెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే వారిపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఉపసంహరించేందుకు చర్యలు తీసుకోవడం తెలంగాణ ప్రయోజనాలకు ఉపయోగదాయకంగా ఉంటుందని కూనంనేని సూచించారు.