విచారణ జరుగుతుండగా ఏ ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థను అడగడానికి వీలులేదని, అయినా వివరాలను రాబట్టేందుకు దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలమే సీబీఐ అధికారుల వద్ద ఉందని అంటున్నారని, తమ వద్ద పలానా ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ పేర్కొంటే, ఆ ఆధారాలకు సంబంధించిన సాక్షిని సజీవంగా ఉంచుతారో చంపుతారో తెలియదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.
తమ వద్ద ఉన్న ఆధారాలతో నిందితులను అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు సంస్థ వివరాలను వెల్లడిస్తుందని, వీళ్లు అత్యుత్సాహం కొద్దీ అడుగుతున్నా, తగుదునమ్మా అంటూ న్యాయమూర్తి గారు కూడా వివరాలు చెప్పండి అనడం సరికాదన్నారు. గతంలో వివరాలను న్యాయమూర్తి లక్ష్మణ్ గారు సీల్డ్ కవర్లో అడిగారని, ఆయన చూసుకున్న తర్వాత తీర్పును ఇచ్చారని అన్నారు.
ఇప్పుడు కేసు ఆయన కాకుండా మరొక న్యాయమూర్తి గారు విచారిస్తున్నారని, తాను ఎంతో మంది రిటైర్డ్ న్యాయమూర్తులతో మాట్లాడానని, ఈనెల 30వ తేదీ లోపు కేసు విచారణను పూర్తి చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఇప్పటికే కేసులు వేసి విచారణను ఆలస్యం చేస్తున్నారన్న అభియోగాలు ఉండడంతో, ఈ కేసులో స్టే ఇస్తానంటే ఏపీ హైకోర్టులో ఏమయిందో… అదే ఇక్కడ రిపీట్ అవుతుందని తెలిపారు.