కడప జిల్లాకు తొలుత వై.యస్.ఆర్. కడప జిల్లా అని నామకరణం చేసి, ఇప్పుడు వై.యస్.ఆర్. జిల్లాగా మార్చారని, అలాగే రాష్ట్రానికి వై.యస్.ఆర్ ఆంధ్ర ప్రదేశ్ గా ఇప్పుడు పేరు పెట్టి, ఆ తరువాత వై.యస్.ఆర్ ప్రదేశ్ గా మార్చుకోండని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు. ఏపీ వన్ యాప్ కు వై.యస్.ఆర్ ఏపీ వన్ గా నామకరణం చేయడం ఆశ్చర్యంగా ఉందని, పార్కులు, ఆసుపత్రులు, బస్టాండ్లకు వై.యస్.ఆర్ నామకరణం చేశారని, రాష్ట్రం పేరు కూడా మార్చి వేస్తే సరిపోతుందని అన్నారు.
ఏపీ వన్ యాప్ కు వై.యస్.ఆర్ గారి పేరును జోడించడం పట్ల, ప్రజలు కనీసం శాంతియుతంగానైనా తమ నిరసనను తెలియజేయకపోవడం బాధాకరంగా ఉందని, ముఖ్యమంత్రి గారి నామకరణ ఉన్మాదం, రంగుల ఉన్మాదం చూసి చిరాకు వేస్తోందని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలంటే అభివృద్ధి చేయాలి తప్పితే, రంగులు వేసి గోడలపై పేర్లు రాస్తే… ప్రజల గుండెల్లో నిలువలేరని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.
రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ఎంపీతో సహా ఎమ్మెల్యేలకు ప్రాణభయం ఉందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఇతరులపై తుపాకి గుళ్ళు కురిపిస్తున్నారని, దళితులపై రాష్ట్రంలో ధమనకాండ కొనసాగుతోందని, దళితులపై దాడులు నిత్య కృత్యమైపోయాయని అన్నారు. పులివెందులకు చెందిన భరత్ యాదవ్ అనే వ్యక్తికి స్థానిక ఎంపీ సిఫార్సుతో ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్సును మంజూరీ చేస్తే, ఆ తుపాకీతో ఇతరుల ప్రాణాన్ని బలిగొన్నాడని, భరత్ యాదవ్ కు ప్రాణహాని ఉన్నదని తుపాకీ లైసెన్స్ మంజూరు చేసినట్లుగా ఎస్పీ హన్బు రాజ్ పేర్కొన్నారని, అవతలి వారి ప్రాణాలను తీసే వ్యక్తికి తుపాకి లైసెన్స్ ఎందుకు ఇచ్చారని మరొకసారి ప్రశ్నిస్తే తాను సీరియస్ అవుతానని ఆయన పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.