సీఎం కేసీఆర్ కు జగన్ ద్రోహం చేస్తున్నాడంటూ సంచలన పోస్ట్ పెట్టారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. హైదరాబాదు నుంచి తనను ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అపహరించి, అరెస్టు చేయడానికి కొంత మంది తెలంగాణ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారికి సహకరించారని, నూటికి నూరు శాతం తనకు సహకరించిన స్నేహితులను జగన్ మోహన్ రెడ్డి గారు మోసం చేశారని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విస్తృత కుట్ర కుంభకోణంలో కీలక వ్యక్తి పేరు రాకుండా ఉండాలంటే, మద్యం కుంభకోణంలో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి కొన్ని పేర్లు చెబితే ఊరట కల్పిస్తామని అన్నట్లుగా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయని వెల్లడించారు.
మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారుతారని పత్రికల్లో రాసినట్టుగానే, ఆయన అప్రూవర్ గా మారడం నిజమే అయినప్పుడు, శరత్ చంద్రారెడ్డి కొన్ని పేర్లను చెబితే వివేకానంద గారి హత్య కేసు విస్తృత కుట్ర కుంభకోణంలో నుంచి కీలక వ్యక్తి పేరు రాకుండా చేస్తామని చెప్పినట్లుగా వచ్చిన వార్త కథనాలను కూడా నమ్మాల్సి వస్తుందని అన్నారు. దీనితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జగన్ మోహన్ రెడ్డి గారు మోసగిస్తున్నారని అర్థం అవుతుందని, ఇది ఆయన పక్కా ఆధారాలతో చెప్పడం లేదని, సగం నిజం అయినప్పుడు, మిగతాది కూడా నిజమే అవుతుందని నమ్మాల్సిందేనని అన్నారు. ఎవరో చెప్పారని సంబంధం ఉందో లేదో తెలియని వ్యక్తి పేరైతే చెప్పలేరని, అలా చెప్పడం అనేది మిత్ర ద్రోహం అవుతుందని, జగన్ మోహన్ రెడ్డి గారు ద్రోహం చేయడంలో పీహెచ్డీ చేశారని, గత ఎన్నికల్లో తమ పార్టీ నెగ్గడానికి కేసీఆర్ గారు ఎంతో సహకరించారని వాదనలు ఉన్నాయని, వ్యక్తిగతంగా కేసీఆర్ గారు అంటే తనకు అభిమానమని అన్నారు. ఆయనకు ద్రోహం చేయడం బాధ కలిగించే అంశమని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి ఎవరెవరి పేర్లను చెబుతారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలన్నారు.