ఏపీలో మీడియా గొంతు నొక్కుతుందెవరో..?

-

నేటి రాజకీయాల్లో మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు అనుబంధంగా మారిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో పార్టీలనే బట్టి మీడియా ఉంటుంది. అధికార వైసీపీకి అనుకూలమైన మీడియా, ప్రతిపక్ష టీడీపీకి అనుకూలమైన మీడియా. ఇక టీడీపీ అధికారంలో ఉంటే, వైసీపీ అనుకూలమైన మీడియాపై ఆంక్షలు కొనసాగాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ అనుకూల మీడియాపై ఆంక్షలు నడుస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా, మీడియా స్వేచ్ఛ హరిస్తున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విమర్శలు చేసింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతుందని టీడీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది.

అయితే తాజాగా అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై విచారణ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే దీనికి సంబంధించిన వార్తలు రాయకూడదని మీడియాపై ఆంక్షలు విధించింది. కోర్టు ఇలా ఆంక్షలు పెట్టడం ఏంటని వైసీపీతో పాటు పలు జాతీయ మీడియా సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. న్యాయస్థానాలు మీడియా నోరు నొక్కుతున్నాయని విజయసాయిరెడ్డి లాంటి వారు మాట్లాడుతున్నారు.

అయితే ఇప్పుడు ఇలా గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలు, కొన్ని జాతీయ మీడియా సంస్థలు, జగన్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవో 2430 గురించి ఎందుకు మాట్లాడటం లేదని తెలుగు తమ్ముళ్ళు అడుగుతున్నారు. గత ఏడాది మీడియా స్వేచ్చని హరించేలా తీసుకొచ్చిన ఈ జీవోని రద్దు చేసి, వైసీపీ నేతలు హైకోర్టు తీర్పుపై కామెంట్ చేయాలని అంటున్నారు. అలాగే జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసులో కూడా చంద్రబాబు, జగన్‌లని ఎన్నికల ప్రచారం మాట్లాడొద్దని, దర్యాప్తు వివరాలు మీడియాకు చెప్పొద్దని ప్రత్యేక దర్యాప్తు బృందానికి కోర్టు ఆదేశాలు జారీచేసిందని గుర్తు చేస్తున్నారు.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మీడియా గొంతు ఎలా నొక్కుతున్నారో, ప్రశ్నించినవారిపై కేసులు ఎలా పెడుతున్నారో కూడా తెలుసని, ఇవన్నీ చేస్తూ వైసీపీ నేతలు మీడియా స్వేచ్చ అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని తమ్ముళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మీడియాని ఆడిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

-Vuyyuru Subhash

Read more RELATED
Recommended to you

Latest news