బేరాల్లేవమ్మా అంటున్న జగన్… లోకేష్ కు ఎందుకంట అంత తుత్తర!

అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగానో ఏమో కానీ… గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీలు, ఏసీబీ ఎంక్వైరీలు వేసుకుంటూ వెళ్తుంది ఏపీ సర్కార్. “టార్గెట్.. స్టాప్ అవినీతి” అన్నపద్దతిలో జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై సీరియస్ గా ఏమాత్రం రాజీపడకుండా ముందుకుపోతున్నారు. ఈ విషయంలో తనవద్ద “బేరాల్లేవమ్మా” అని జగన్ అంటుంటే… అనవసరంగా తనపని తానుచేసుకోక, తన విమర్శలు తానుచేసుకోక, తన పరామర్శలు తాను చేసుకోక.. తుత్తరతో ముందే కూసేస్తున్నారు చినబాబు లోకేష్!

టీడీపీ హయాంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగాయని అధికార వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ముందుగా చంద్రన్న కానుకలు, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఈఎస్ఐ స్కాం లనే ముందుగా ఎందుకు లైన్ లో మొదలుపెట్టింది? వాటికి సంబందించిన ఆధారాలే ముందుగా దొరికాయన్నది వైకాపా నేతల సమాధానం అయినా… దానిలో ఉన్న అంతరార్థం టీడీపీ నేతలకు ఇప్పటికే అర్ధం అయిఉండాలి! వాటన్నింటిలోనూ చినబాబు పాత్ర ఉందనే కామెంట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న తరుణంలో… వైకాపా ప్రభుత్వం మరింత అత్యుత్సాహం చూపిస్తుందని అంటున్నారు!

ఆ సంగతులు అలా ఉంటే.. ఈ మధ్య తనమార్కు ఓదార్పు యాత్రలో భాగంగా అవినీతి, అక్రమాల కేసుల్లో అరెస్టయిన తమ పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించడానికని వారి వారి ఇళ్లకు వెళ్తున్నారు లోకేష్. అందులో భాగంగా మైకందుకుని జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… ఐటీ గ్రిడ్ వ్యవహారంతో అప్పటి ఐటీ మంత్రి (లోకేష్) కి సంబంధం లేదు అని చెబుతున్నాడు లోకేష్. అసలు ఎవరు అడిగారని?

సరిగ్గా అక్కడే వైకాపా నేతలకు దొరికిపోతున్నాడు లోకేష్. ఫైబర్ గ్రిడ్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం.. కాబట్టి ఏపీ ఐటీ మంత్రికి సంబందం ఉండదు అనేది లోకేష్ లాజిక్ అవ్వొచ్చు! దీంతో… ఈఎస్ఐ లో మందులు, పరికరాల కొనుగోళ్ల వ్యవహారం కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే.. కానీ ఏపీ మంత్రి అచ్చెన్నను ఏసీబీ పట్టుకుపోలేదా… కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టే కదా సీబీఐ కి ఇచ్చింది.. అనేవి వైకాపా నేతల సమాధానం! అసలు ఫైబర్ గ్రిడ్ తో అప్పటి ఐటీ మంత్రికి సంబంధం లేదని లోకేష్.. ఎవరూ అడగకుండానే చెబుతున్నారంటే, ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందని పరోక్షంగా ఒప్పుకోవడమే కదా.. మరో లాజిక్!

దీంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారని, ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో ఆయన నిండా మునిగారని, మరో వారం పది రోజుల్లో ఆయనకు నోటీసులు అందించి అరెస్టు చేయబోతున్నారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ శ్రేణులను ఉన్న నాలుగు రోజులైన ప్రశాంతంగా ఉంచకుండా… ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అవినీతిలో తనకు సంబందం లేదన్నట్లుగా మాట్లాడి… అవినీతి అయితే జరిగిందన్న హింట్ ఇవ్వడం, తద్వారా శ్రేణులను టెన్షన్ పెట్టడం అవసరమా అని తమ్ముళ్లు ఫీలవుతున్నారంట.