కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాలన్ని యుద్ధం చేస్తున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దీని పుట్టుకకు కారణమైన చైనా ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు చాలా తీవ్రంగా శ్రమించింది. ఇందులో సక్సెస్ అయ్యమని చైనా భావిస్తున్న సమయంలో మరోసారి అక్కడ కరోనా వైరస్ కలకలం రేపింది. రాజధాని బీజింగ్ సమీప ప్రాంతాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆదివారం నాడు మరోసారి లాక్ డౌన్ విధించారు.
అంతేకాకుండా పక్కనే ఉండే హెబెయ్ ప్రావిన్స్‌లో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆన్ షిన్ కౌంటీలో బీజింగ్ నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాలను పూర్తిగా మూసేసి నియంత్రణలోకి తీసుకుంటున్నామని వైద్యాధికారులు ప్రకటించారు. నిత్యావసరాలు, ఔషధాల కొనుగోలు వంటి వాటికి ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. వైద్య చికిత్సల విషయంలో మాత్రమే వ్యక్తిగత ప్రయాణాలకు అనుమతిస్తున్నారు. కరోనా ఆవిర్భావ ప్రాంతం వుహాన్ మాదిరిగానే ఇక్కడా కఠిన ఆంక్షలు అమలు చేయనున్నామని వెల్లడించారు..