ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నట్లు తయారైంది తెలుగుదేశం పార్టీలో నాయకులు పరిస్థితి. ఒక వైపు చూస్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ఏ ఒక్కరిలోనూ లేదు. పోనీ రాజకీయ చాణిక్యుడు చంద్రబాబు ఏమైనా చక్రం తిప్పి మళ్లీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాడా అంటే, ఆ నమ్మకం ఆ పార్టీ నాయకులకు లేదు. ఎందుకంటే చంద్రబాబు వయసు ఎప్పుడో రిటైర్ మెంట్ స్టేజి దాటిపోయిందని, ఇంకా కొంతకాలం మాత్రమే ఆయన యాక్టివ్ గా రాజకీయాలు చేయగలరు అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక టిడిపి పగ్గాలు లోకేష్ కు అప్పగిస్తే ఏం జరుగుతుందో చంద్రబాబుతో పాటు ఆ పార్టీలోని నాయకులు అందరికీ బాగా తెలుసు. అంతగా ఆయన పై అందరికీ నమ్మకాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే పార్టీలో నాయకులంతా మళ్ళీ యాక్టివ్ అయ్యి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చంద్రబాబు అరిచి మొత్తుకుంటున్నా, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్న నాయకులు అతి తక్కువ మందే కనిపిస్తున్నారు. చాలామంది తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్లుగా సైడ్ అయిపోతున్నారు. ఇప్పట్లో తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశం లేకపోవడం, అధికారం దక్కుతుందనే ఆశలు లేకపోవడంతో చాలా మంది నాయకులు యాక్టివ్ గా రాజకీయాలు చేసేందుకు, ఇష్టపడడంలేదు. అధికార పార్టీ తమను ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనే అభిప్రాయం టిడిపి నేతల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు వంటివారే జైలుకు వెళ్లారు. తామెంత అన్నట్లుగా ఎవరికి వారు సైలెంట్ గా ఉంటున్నారు.
పోనీ నాయకులు ఇలా ఉంటే, మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు సైతం ఇప్పుడు పార్టీకి అందుబాటులో ఉండటం లేదట. స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి మరీ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలని నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, హడావుడి చేయాలి అని పదేపదే చెబుతున్నా, ఏ ఒక్కరూ ముందుకు కదిలేలా కనిపించడం లేదు. కొంత మంది కనీసం చంద్రబాబు ఫోను కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదట.
ఇప్పటి కే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ ఎంపీలు, వైసీపీ కండువా కప్పుకోగా, మరికొంతమంది బిజెపి వైపు చూస్తున్నారు. ఈ సమయంలో రోడ్లపైకి రమ్మని బాబు మొట్టుకుంటున్నా, ఎవరిలోనూ ఉలుకు పలుకు కనిపించడం లేదట. పాత తరం నాయకుల సంగతి ఈ విధంగా ఉంటే యువ నాయకుల పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. తెలుగుదేశంలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన యువ నాయకులంతా ఇప్పుడు పార్టీ పరిస్థితిపై ఆందోళనతో, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఈ సమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పార్టీ శ్రేణులను ఆకర్షించే మంత్రదండం ఉపయోగిస్తే తప్ప పని అయ్యేలా కనిపించడం లేదు.
-సూర్య