ఏపీలో మరో నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ కాబోతుందా ? ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన అభ్యర్థులు దొరక్క, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు లేక విలవిల్లాడుతోన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ క్రమంలోనే మరో కీలక నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. అదే శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు సొంత నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనలో రాజాం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో కళా వెంకటరావు పక్కనే ఉన్న ఎచ్చెర్లకు మారారు.
ఇదే నియోజకవర్గంలో మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకురాలు కావలి ప్రతిభాభారతి, మరో మాజీ మంత్రి కొండ్రు మురళీ తదితరులుకు మంచి పట్టు ఉంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో కళా వెంకటరావు ఈ నియోజకవర్గంలో ఎవ్వరిని ఎదగనిచ్చే పరిస్థితి లేదంటున్నారు. రిజర్వ్ అయ్యాక 2009, 2014 ఎన్నికల్లో ప్రతిభా భారతి ఓడిపోవడానికి, గత ఎన్నికల్లో కొండ్రు మురళీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కళా వర్గం సహకరించలేదన్నన ఆరోపణలు ఉన్నాయి. ఇక కళాను చంద్రబాబు త్వరలోనే ఏపీ టీడీపీ అధ్యక్ష పగ్గాల నుంచి తప్పిస్తున్నారు. అదే క్రమంలో విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా కళా తమ్ముడు కుమారుడు, చీపురుపల్లి పార్టీ ఇన్‌చార్జ్ కిమిడి నాగార్జున ఎంపికయ్యారు.
రాజాం కూడా అదే పార్లమెంటరీ జిల్లా పరిధిలో ఉండడంతో ఇప్పుడు రాజాంలో మళ్లీ కళా కుటుంబ పెత్తనమే నడవనుంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రతిభా భారతిని పక్కన పెట్టి మరీ మాజీ మంత్రి కొండ్రు మురళీకి సీటు ఇవ్వగా ఆయన ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఈ నియోజకవర్గంలో టీడీపీకి అయితే కొండ్రు లేదా ప్రతిభా భారతే దిక్కు. ప్రతిభ తన కుమార్తె గ్రీష్మకు సీటు ఇవ్వాలని పట్టు బడుతోంది. అయితే ఇప్పుడు అటు ప్రతిభతో పాటు ఇటు కొండ్రు ఇద్దరూ పార్టీకి దూరమవుతున్నట్టు తెలుస్తోంది.
ప్రతిభా భారతి తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతోన్న పరిస్థితి. ఆమెతో ఇప్పటికే వైసీపీ నేతలు మంతనాలు ప్రారంభించారని టాక్. ఇక కొండ్రు మురళీ సైతం అదే వైసీపీలోకి వెళ్లేందుకు రెడీగానే ఉన్నారు. అయితే అక్కడ కంబాల జోగులు పాతుకు పోవడంతో ఆయనకు అక్కడ ప్రాధాన్యం ఉండదన్న ఒక్క కారణంతోనే ఆగుతోన్న పరిస్థితి లేకపోతే జోగులు ఈ పాటికే ఫ్యాన్ కిందకు చేరిపోయేవారట. ఏదేమైనా రాజాంలో ఈ ఇద్దరు కీలక నేతలు టీడీపీలో రాజకీయం చేసేందుకు నిరాసక్తతో ఉండడంతో రాజాం టీడీపీ త్వరలోనే ఖాళీ అవుతోన్న మాట వాస్తవం.
-vuyyuru subhash