సొంత పార్టీలోనే లోకేష్ అంత అలుసయ్యాడా ?

నారా లోకేష్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్సీ కావచ్చు. కానీ రానున్న రోజుల్లో ఆయన టిడిపి రథసారధిగా, కుదిరితే ఏపీ ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్న నాయకుడు. ప్రస్తుతానికి లోకేష్ తండ్రి చాటు బిడ్డగానే ఉంటున్నా, రానున్న రోజుల్లో పార్టీలో యాక్టివ్ రోల్ పోషించాల్సి ఉంది. ముందుండి ఆయన పార్టీని నడిపించాల్సిందే. ఈమేరకు లోకేష్ కు అన్నిరకాల ట్రైనింగ్ లు ఇప్పిస్తూ, హడావుడి చేస్తున్నారు. కాకపోతే పార్టీ నేతల్లోనే లోకేష్ వ్యవహార శైలి పైన, ఆయన పనితీరు పైన అస్సలు నమ్మకమే లేదు. అసలు చినబాబు నాయకత్వంలో పని చేయాలంటేనే, ఆ పార్టీ నాయకులకు నోట మాట రావడం లేదు. ఇక పార్టీ సీనియర్ నాయకులు చాలామంది బహిరంగంగానే లోకేష్ తీరుపై విమర్శలు చేస్తూ ఉంటారు.

అసలు ఆయన నాయకత్వంలో పని చేయడం కంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటే బెటర్ అన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ విషయం బాబుకు కూడా బాగా తెలుసు. అందుకే సీనియర్లతో కంటే యువ నాయకుల అండదండలు లోకేష్ కు ఉండేలా, పార్టీలో ఎక్కువగా యువ నాయకత్వాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే పని ఒత్తిడి తగ్గించుకునేందుకు, పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడుని మార్చాలని చాలాకాలంగా చంద్రబాబు చూస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్న నాయుడుని ఆ పదవిలో కూర్చోబెట్టాలని, ఆయన అయితేనే సరైన న్యాయం చేయగలరని, పార్టీని గాడిలో పెట్టగలరు అని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయమై అచ్చెన్నకు చెప్పిన సందర్భంలో ఆయన షాకింగ్ రిప్లై ఇచ్చాడట.  అధ్యక్షుడిగా ఉండేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, నేను అధ్యక్షుడు గా ఉంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా, అందులో ఎవరి జోక్యం ఉండకూడదని, అలా అయితే నేనే తీసుకుంటాను అంటూ ఆయన చెప్పినట్లుగా ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది. అయితే లోకేష్ ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా  పార్టీలో ఇప్పుడు పార్టీలో టాక్ నడుస్తోంది.

ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు వ్యవహారంలోనూ, లోకేష్ పదే పదే జోక్యం చేసుకుంటూ రావడం, ఆయన కేవలం ఉత్సవ విగ్రహంలా కూర్చోబెట్టడంతో అచ్చెన్న ఇప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీలోని నాయకులంతా లోకేష్ వ్యవహారంపైనే ఎప్పటి నుంచో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రానున్న రోజుల్లో పార్టీని లోకేష్ లీడ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని అసంతృప్తులు బయటపడే ఛాన్స్ లేకపోలేదు.

 

-Surya