తెలంగాణ హైకోర్టు ఎఫెక్ట్‌: వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు..!

-

వైసీపీలో ఒక అంశంపై కీల‌క చ‌ర్చ సాగుతోంది. అది కూడా సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన విష‌య‌మే కావ‌డం అత్యంత ఆస‌క్తిగా ఉంది. తెలంగాణ హైకోర్టు తాజాగా రాజ‌కీయ నేత‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై పెండింగులో ఉన్న కేసుల విష‌యంలో సీరియ‌స్‌గా స్పందించ‌డం.. వ‌చ్చే 9 నెల‌ల్లో వాటిని తేల్చేయాల‌ని నిర్ణ‌యించ‌డం ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురి చేస్తోంది. తెలంగాణ హైకోర్టు నిర్ణ‌యంతో ఏపీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్క‌డే ఉంది అస‌లు కిటుకు. సీఎం జ‌గ‌న్‌కు సంబంధించి కీల‌క కేసుల విచార‌ణ తెలంగాణ హైకోర్టులోనే సాగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా సీబీఐ న‌మోదు చేసిన 17 కేసులు అక్క‌డ పెండింగ్‌లో ఉన్నాయి.

ప్ర‌స్తుతం సుప్రీం కోర్టు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ నేత‌ల‌పై ఉన్న కేసుల విచార‌ణ‌ను త్వ‌రిత‌గతిన పూర్తి చేయాల‌ని దేశంలోని అన్ని హైకోర్టుల‌ను ఆదేశించింది. అదే స‌య‌మంలో ప్ర‌త్యేక న్యాయ‌స్థానాల‌ను ఏర్పాటు చేసైనా వాటిని వ‌చ్చే 9 మాసాల్లో తేల్చేయాల‌ని కూడా ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టు యుద్ధ ప్రాతిప‌దిక‌న ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం, దేశంలోని మిగిలిన హైకోర్టుల క‌న్నా దూకుడు చూపించ‌డం వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీని వెనుక ఏదైనా రాజ‌కీయం ఉందా ? అనే కోణంలోనూ వారు ఆరా తీస్తున్నారు.

ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్‌ను ఇర‌కాటంలోకి నెట్టాలంటే.. ఇప్పుడు చేస్తున్న ఉద్య‌మాలు, చేస్తున్న ఆరోప‌ణ‌లు సాగ‌వ‌ని టీడీపీ ప్ర‌ధానంగా భావిస్తోంది. అదే స‌మ‌యంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా త‌మకు నీటి విష‌యంలో జ‌గ‌న్ అడ్డును తొలిగించుకుంటేనే బెట‌ర్ అని త‌ల‌పోస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై ఉన్న కేసులు త్వ‌ర‌గా విచార‌ణ‌కు వ‌చ్చేలా పావులు క‌దుపుతున్నారా ? అనే కోణంలో రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు రాజ‌కీయాల‌ను ఆపాదించ‌లేమ‌ని మ‌రికొంద‌రు నేత‌లు చెబుతున్నారు.

వాస్త‌వానికి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ నేత‌ల‌పై కూడా కేసులు ఉన్నాయ‌ని.. విచార‌ణ‌కు వ‌స్తే.. వాటిలో చంద్ర‌బాబుపై కూడా ఉన్న కేసులు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని, కాబ‌ట్టి అంద‌రికీ ఇది ఇబ్బంది కావొచ్చ‌ని అంటున్నారు. ఇంకొంద‌రు ఈ హ‌డావుడి అంతా తాత్కాలిక‌మేన‌ని… చాలా వ‌ర‌కు సీబీఐ కేసుల్లో విచార‌ణే కాలేద‌ని, కాబ‌ట్టి చార్జిషీట్లు దాఖ‌లు చేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని, చెప్పినంత తేలిక‌గా విచార‌ణ పూర్తి అయ్యే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. మొత్తానికి ఏదేమైనా వైసీపీ నేత‌లు మాత్రం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుండ‌డం మాత్రం క‌నిపిస్తోంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news