కోనసీమకు వచ్చే అన్ని దారులు మూసివేత

హిందూ ఆలయాల‌పై దాడుల‌ విషయంలో ప్రభుత్వం తీరుకు నిరనగా బిజెపి ఆందోళనకి పిలుపునిచ్చింది. హిందూ‌వాదులను అక్రమంగా అరెస్టు లు‌ చేశారంటూ ఈరోజు ఛలో అమలాపురం కు పిలుపునిచ్చారు సోము వీర్రాజు. అలెర్ట్ అయిన పోలీసులు… ముందస్తు చర్యలు తీసుకున్నారు. బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను హౌస్ అరెస్టు చేశారు.

ప్రభుత్వం ఎన్ని‌ అడ్డంకులు సృష్టించినా… చలో అమలాపురం ఈరోజు జరిగి తీరుతుందని ప్రకటించిన సోము‌ వీర్రాజు, వైసిపి ప్రభుత్వం చేస్తున్న దమనకాండను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని ప్రకటన చేశారు. ఇక బీజేపీ ఛలో అమలాపురం నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. సుమారు 600 మంది అమలాపురంలో రాత్రి నుంచి పహారా కాస్తున్నారు. బీజేపీ నేతలు పట్టణంలోకి ప్రవేశించకుండా కోనసీమ కు వచ్చే అన్ని దారులు మూసివేశారు. కొందరు నేతలు అర్ధరాత్రి ఏదోలా పట్టణంలో కి రాగా వారిని గుర్తించి అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తోంది. అమలాపురం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లే దారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.