ఏపీలో మ‌ళ్లీ ఎన్నిక‌లు… ఆ ఇద్ద‌రు ఎంపీలు రాజీనామాకు రెఢీ..!

ఏపీలో ప్ర‌స్తుతం రాజ‌ధాని అమ‌రావ‌తి అంశం అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఓ కుదుపు కుదుపుతోంది. మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా వైసీపీ, అమ‌రావ‌తినే రాజధానిగా కొన‌సాగించాల‌ని టీడీపీ పోరాటాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు, రాజీనామాల హ‌డావిడి మామూలుగా లేదు. ఇదిలా ఉంటే అమ‌రావ‌తి విష‌యంలో జ‌నసేన సంచ‌ల‌న డిమాండ్ చేసింది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం అరెస్టు చేసిన రాజ‌ధాని రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు రాజ‌ధాని గ్రామాల్లో ప‌ర్య‌టించిన జ‌న‌సేన నేత‌లు స‌రికొత్త డిమాండ్ తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చారు.

ఈ క్ర‌మంలోనే గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి అమ‌రావ‌తి రాజ‌ధాని రిఫ‌రెండెంగా ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని డిమాండ్ చేసింది.  ఓ టీడీపీ ఎంపీ, ఓ వైసీపీ ఎంపీ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రాజ‌ధాని అంశంగా రిఫ‌రెండెం కోరితే అమ‌రావ‌తిపై ప్ర‌జ‌ల్లో ఏముందు తెలిసిపోతుంద‌ని వారు చెపుతున్నారు. ఎంపీలు రాజీనామాలు చేస్తే అమ‌రావ‌తిపై కేంద్రంలోనూ క‌ద‌లికి వ‌స్తుంద‌ని జ‌న‌సేన కీల‌క నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఇద్ద‌రు ఎంపీల్లో నందింగం సురేష్ మూడు రాజ‌ధానుల‌కు పార్టీ స్టాండ్‌గా ముందు నుంచి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఇక జ‌య‌దేవ్ అమ‌రావ‌తిని మాత్ర‌మే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని పట్టు బ‌డుతున్నారు. జ‌న‌సేన డియాండ్ ఎలా ఉన్నా… ఆ పార్టీ స‌వాల్ మేర‌కు ఈ ఇద్ద‌రు రాజ‌ధాని అమ‌రావ‌తి రిఫ‌రెండెంగా ఉప ఎన్నిక‌ల‌కు వెళితే రాజ‌ధాని ప్రాంతంలో అమ‌రావ‌తికి ప్ర‌జ‌లు అనుకూల‌మో, వ్య‌తిరేక‌మో తేలిపోతుంది. ఈ ఇద్ద‌రు ఎంపీలు ఉప ఎన్నిక‌ల‌కు వెళ‌తారా ?  లేదా ? అన్న‌ది వారి ఇష్టం.

ఇక ఏపీలో ఇప్ప‌టికే తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. ఇక న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు సైతం అమ‌రావ‌తి రిఫ‌రెండెంగానే తాను ఉప ఎన్నిక‌ల‌కు సై అంటున్నారు. ఏదేమైనా అమ‌రావ‌తి అంశం హీటెక్కి ఎంపీల రాజీనామాల వ‌ర‌కు వెళితే ఏపీలో ఉప ఎన్నిక‌ల‌తో రాజ‌కీయం వేడెక్కుతుంద‌న‌డంలో డౌట్ లేదు.