వెక్కిరిస్తున్న ఖాళీ ఖజానా ? జగన్ ఏం చేస్తారో ?

-

తన చేతికి ఎముకే లేదు అన్నట్లుగా ఏపీ సీఎం జగన్ ప్రజలకు వరాల జల్లులు కురిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కష్టాలు చుట్టుముట్టినా, ఎక్కడా లెక్కచేయకుండా అన్ని పథకాలను నిరాటంకంగా జరిగే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను తెలుసుకుని దానికి అనుగుణంగా కొత్త కొత్త పథకాలను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ, తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు. అసలు ఆర్థిక కష్టనష్టాలు నలువైపులా చుట్టుముట్టిన తరుణంలో జగన్ పరిపాలన సాఫీగా ఎలా చేయగలుగుతున్నాడు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగానే ఉంది. పోనీ ఏపీ  ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగుందా అంటే ? అంతంతమాత్రంగానే ఉంది. అయినా జగన్ ఎక్కడా లెక్క చేయడం లేదు.

jagan
jagan

ఇక ఏపీ తెలంగాణ విభజన సమయంలో ఏపీలో 90 వేల కోట్లు అప్పుల్లో ఉంటే, టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ అప్పును రెండున్నర లక్షల కోట్లకు తీసుకొచ్చారు చంద్రబాబు. ఇక జగన్ అధికారం చేపట్టే సరికి ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. నిధులు లేక ఏపీ ప్రభుత్వం అల్లాడింది. జగన్ 15 నెలల పరిపాలన కాలంలో 97 వేల కోట్ల అప్పులు తెచ్చినట్లుగా తెలుగుదేశం విమర్శలు చేస్తోంది. ఒక వైపు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు అవసరం. మరోవైపు చూస్తే ఆదాయ మార్గాలు సన్నగిల్లాయి. ఇంకోవైపు ఆదాయం పెంచుకుందాం అంటే కరోనా ఎఫెక్ట్.

ఇక మరో ప్రధాన ఆదాయ వనరుగా మద్యం ఉన్నా,  సంపూర్ణ మద్యపాన నిషేధం విధించేందుకు జగన్ ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని మద్యం షాపులను నడిపిస్తున్నారు. అవి కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే. దీంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వానికి కష్టంగా మారింది. అయినా జగన్ మాత్రం సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా జగన్ నగదు బదిలీ చేస్తున్నారు.

ఒకవైపు తప్పులు చేస్తూనే, మరోవైపు కొత్త కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి భారీగా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. ఆ విధంగా ఆదాయం గణనీయంగా పడిపోవడంతో, జగన్ ప్రభుత్వాన్ని బరువుగానే మోస్తున్నారు. ఏదో ఒకరకంగా ఆర్ధిక  కష్టాల నుంచి బయటపడేందుకు జగన్ కేంద్ర సహాయం పదేపదే కోరుతున్నారు. బీజేపీ అగ్రనేతలతో రాయబారాలు నడుపుతూ, ఏపీని ఆదుకోవాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పెండింగ్ నిధుల తాలూకా బిల్లులను ఆమోదించి సొమ్ములు అందించాలని కోరుతున్నారు. ఏపీకి ఆదాయ మార్గాలను సృష్టించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news