తిరుపతి రాజధాని నగరం అవుతుందని అన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పెషల్ ఇన్వైటి చింతా మోహన్. వెంకటగిరి రాజధాని అవుతుందని పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం చెప్పారని.. వీరబ్రహ్మం చెప్పిన దానిపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఏర్పేడు నుంచి రావూరి వరకు లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు.
1953లో ఎన్జీ రంగా తిరుపతిని రాజధాని చేయాలని అప్పుడే అన్నారని తెలిపారు. ఆ రోజుల్లో నీలం సంజీవరెడ్డి ఏపీకి కర్నూలును ముఖ్య పట్టణం చేశారని.. 2013 అక్టోబర్ 19న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తిరుపతి సీమాంధ్రకు రాజధానిగా చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారని తెలిపారు. అలాగే దేశంలో మాతా శిశు మరణాలు పెరిగిపోతున్నాయి అన్నారు చింతా మోహన్.
దేశంలో 40 వేల ఆరోగ్య ఉప కేంద్రాలు, 9 వేల పిహెచ్సిలు మూతపడ్డాయన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు అద్వానంగా ఉందని మండిపడ్డారు. దేశ ప్రజలు 80 శాతం మంది అప్పుల్లో ఉన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ఏఐసీసీ ఎన్నికలలో మల్లికార్జున ఖర్గే గెలుపు ఏకపక్షం అన్నారు.