రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతోనే పోటీ పడతారని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శుక్రవారం విజయనగరం జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. తనను గుండెల్లో పెట్టుకున్న గిరిజనులకు అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. సాలూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
గిరిజన పుత్రుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ వర్సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గిరిజనులు స్వచ్ఛమైన, కల్మషం లేని మనుషులని కొనియాడారు. తరతరాలుగా వారిని పేదరికం వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్. వారి జీవన ప్రమాణాలు పెంచడానికి, దోపిడీ నుండి వారిని రక్షించడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నామని తెలిపారు.