భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. సోమవారం తెలంగాణలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఏపీలో మాత్రం గ్యాప్ ఇవ్వకుండా దంచి కొడుతుంది. దీంతో ఈ వర్షాలపై నేడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. నేడు రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాలు, వరదల గురించే కాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబును అరెస్టు చేయడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏపీలో అధికారం మారేందుకు ఇదే బలమైన కారణమన్నారు. చంద్రబాబు చట్టం ప్రకారం నడుచుకునే వ్యక్తి అని.. కక్ష సాధింపు చర్యలు ఎప్పటికీ మంచిది కాదన్నారు. మార్గదర్శి కేసు విషయంలో బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తారని అనుకున్నానని.. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన ఆఫిడవిట్ ని చంద్రబాబు ప్రభుత్వం విత్ డ్రా చేయడం దారుణం అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఇదేనన్నారు ఉండవల్లి. ఈ నెల 11వ తేదీన మార్గదర్శి కేసు విషయంలో ఉన్న వాయిదాలో ఏపీ సర్కార్ అఫిడవిట్ వేయాలని భావిస్తున్నానన్నారు. కక్ష సాధింపు చర్యల వల్ల అధికారుల తీరు మారనుందని.. భవిష్యత్తులో ముఖ్యమంత్రిల మాటలను ఐపీఎస్ అధికారులు వినే అవకాశం లేదన్నారు. అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని గుర్తు చేశారు. ఆ తప్పును చంద్రబాబు చేయకూడదని కోరారు.