తిరుప‌తి వైసీపీ అభ్య‌ర్థిగా ఊహించ‌ని పేరు ఖ‌రారైందే..!

ఏపీలోని తిరుపతి పార్ల‌మెంటు స్థానానికి మ‌రో మూడు నెల‌ల్లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే టీడీపీ కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మిని త‌మ అభ్య‌ర్థిగా ప్ర‌కటించ‌డంతో పాటు అధికార వైసీపీ కూడా అభ్య‌ర్థి అన్వేష‌ణ‌లో ఉంది. మ‌రో వైపు బీజేపీ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ స‌పోర్ట్‌పై ఆశ‌లు పెట్టుకోగా ఇప్పుడు ఆ ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. దీంతో త్వ‌ర‌లోనే బీజేపీ కూడా త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌ని చూస్తోంది. ఇక అధికార వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటును ఏకంగా 2.28 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలుచుకుంది. ఆ త‌ర్వాత అక్క‌డ గెలిచిన బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ క‌రోనాతో మృతి చెంద‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ఇక్క‌డ అభ్య‌ర్థి ఎంపిక బాధ్య‌త‌ను పార్టీ నాయ‌కులు సీఎం జ‌గ‌న్‌కే అప్ప‌గించారు. ముందుగా మృతి చెందిన దుర్గాప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో ఇత‌రుల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. హైద‌రాబాద్‌లో ఉంటోన్న పారిశ్రామిక‌వేత్త మ‌ధు పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా మృతిచెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడు కల్యాణ్‌ చక్రవర్తిని రంగంలోకి దింపాలా ? అన్న చ‌ర్చ‌లు కూడా వైసీపీలో ప్రారంభ‌మ‌య్యాయి. అలాగే పాద‌యాత్రలో జ‌గ‌న్ వెంట న‌డిచిన ఫిజియో థెర‌పిస్ట్ గురుమూర్తి పేరు కూడా వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి రేసులో వినిపిస్తోంది.

ముందుగా బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ కుటుంబ స‌భ్యుల‌ను పిలిచి వారి అభిప్రాయం తెలుసుకున్నాకే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌ని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఒక‌వేళ ఆ కుటుంబంలో ఎవ్వ‌రూ ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోతే ఆయ‌న కుమారుడు క‌ళ్యాణ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న కూడా ఉందంటున్నారు. ఇక టీడీపీ ఇప్ప‌టికే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంతో పాటు పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అనేక మంది ఇన్‌చార్జ్‌ల‌ను కూడా నియ‌మించింది. వీరిలో చాలా మంది ఎక్క‌డెక్క‌డ పార్టీ ప‌రిస్థితి ఎలా ?  ఉందో ?  తెలుసుకుంటున్నారు.

దుబ్బాక‌లో బీజేపీ అభ్య‌ర్థి ముందుగా ప్ర‌చారంలో ఉండ‌డంతో అక్క‌డ అధికార టీఆర్ఎస్ ఓడింది. ఇప్పుడు ఇక్క‌డ టీడీపీ ముందుగానే అభ్య‌ర్థిని ప్ర‌కించ‌డంతో పాటు ప్ర‌చారం ప్రారంభించ‌డంతో ఆ త‌ప్పు ఇక్క‌డ జ‌ర‌గ‌కూడ‌ద‌ని.. ముందుగానే త‌మ అభ్య‌ర్థిని కూడా ప్ర‌క‌టించాల‌ని వైసీపీ భావిస్తోంది.