2027 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల సైజుకు ఇండియా చేరుతుందని తెలిపారు విజయ సాయిరెడ్డి. ‘ఈ దశాబ్దం చివరికల్లా (2029–30) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుంది. దేశంలోని కార్మికులు, కర్షకులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు,’ అన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మాటలు నిజమవుతాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. ఆదివారం హరియాణాలోని కేథల్ నగరంలో జరిగిన ప్రసిద్ధ సాధువు ధన్నా భగత్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారన్నారు.
సాంకేతికపరిజ్ఞానం ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను వారి ముంగిట్లోనే అందజేస్తున్నారని అంటూ భారత్ సాధించే విశేష ప్రగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు ధంఖడ్. ఉపరాష్ట్రపతి అభిప్రాయాలతో ఏకీభవించే విధంగా ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డూయిష్ బ్యాంక్ కూడా ఇండియాపై తన అంచనాలు ప్రకటించింది. ‘ప్రస్తుత భారత వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 7 లక్షల కోట్ల డాలర్లకు 2030 నాటికి పెరుగుతుంది. ఇంతటి ఆర్థికాభివృద్ధిని మధ్యకాలంలో నిలకడగా సాధించాలంటే–తరచు చెప్పే అధిక జనాభా లేదా వస్తు వినియోగం మాత్రమే సరిపోదు. ఈ రెండూ ఇండియాకు ఆర్థికంగా సత్తువ ఇచ్చే కీలకాంశాలు,’ అని డూయిష్ బ్యాంక్ వ్యాఖ్యానించిందని తెలిపారు సాయిరెడ్డి.
తన అంచనాకు కారణాలు వివరిస్తూ, ‘ప్రస్తుత దశాబ్దంలో భారత్ మంచి ప్రగతి సాధించడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో గణనీయ సంఖ్యలో ఉన్న యువత జనాభా ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కారణం కాగా, ప్రభుత్వ విధానాలు దీనికి తోడవుతున్నాయి,’ అని ఈ సంస్థ వివరించింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2025 కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని నిరంతరం విశ్లేషించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసిందన్నారు.