రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం, బాపట్ల, పుట్టపర్తిలో ఆంధ్రప్రదేశ్ లో పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ భూములను లీజుపై కేటాయించారంటూ ప్రతిపక్షమైన తెలుగుదేశం భజన పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. ఇందులో చట్టవ్యవతిరేకం ఏమీ లేదు. అధికార దుర్వినియోగం కూడా కాదన్నారు.
గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అనేక రాజకీయపక్షాలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించారు. వాటిపై ఆయా పార్టీల ఆఫీసులు, అనబంధ సంస్థల కార్యాలయాల నిర్మాణం కూడా జరిగి చాలా ఏళ్లవుతోంది. 1997లో టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తన పార్టీ ఆఫీసు కోసం హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లో 33 ఏళ్ల లీజుపై ప్రభుత్వ స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరిట ఉమ్మడి ఏపీ తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం నిర్మించారని తెలిపారు.
తర్వాత జననేత, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ప్రభుత్వం బంజారా హిల్స్లోనే రెండెకరాల సర్కారీ జాగాను అప్పటి ప్రాంతీయపక్షం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్)కి మంజూరు చేశారు. ఈ స్థలంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలోని రాజకీయ పార్టీ రాష్ట్ర కార్యాలయం నడుస్తోంది. ఇలా ప్రభుత్వ స్థలాలు సమృద్ధిగా ఉన్న నగరాలు, పట్టణాల్లో వివిధ రాజకీయపక్షాల అభ్యర్థన మేరకు సర్కారీ జాగాలు కేటాయించడం సర్వసాధారణమన్నారు.
ఈ విషయాలన్నీ తెలిసి కూడా విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ ఆఫీసుకు ప్రభుత్వ స్థలం ఇచ్చారని, బాపట్లలో ఇదే పార్టీ కార్యాలయం కోసం ప్రభత్వ భూమిని కేటాయిస్తున్నారని, పుట్టపర్తిలో కూడా పాలకపక్షం ఆఫీసు నిర్మాణానికి లీజుపై సర్కారీ భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించిందని అంటూ పచ్చ మీడియా రంకెలేస్తోంది. పాత సాంప్రదాయాలు, ఆనవాయితీ ప్రకారం రాజకీయపక్షాలకు ప్రభుత్వ భూములను కేటాయిస్తే టీడీపీ అనుకూల మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది. పాలకపక్షంపైనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర సర్కారుపైనా దుష్ప్రచారం చేయడానికి ఎంతకైనా దిగజారడానికి చంద్రబాబు అండ్ కంపెనీ సదా సిద్ధంగా ఉంటుందని ఈ పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి.