ఆ ‘ముగ్గురు’ టీడీపీ నేత‌ల రూట్ మారుతుందా..?

2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌ని తట్టుకుని టీడీపీ తరుపున ముగ్గురు ఎంపీలు విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్‌లు గెలిచారు. గతంలో వీరు పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై గట్టిగా గళం విప్పడంతోనే, ఎన్నికల్లో ప్రజలు రెండోసారి వీరిని గెలిపించారు. ఇక రెండోసారి గెలిచిన వీరు ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.

ముఖ్యంగా జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ముగ్గురు అమరావతి కోసం గట్టిగానే పోరాడారు. కానీ ఈ మధ్య గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదం తెలిపాక, అంతగా అమరావతి గురించి పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తప్పా, బయట అంతగా అమరావతి గురించి మాట్లాడటంలేదు. అసలు రాజధాని పరిధిలో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పెద్దగా దీనిపై స్పందిస్తున్నట్లు తెలియడం లేదు.

ఇలా గల్లా యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం ఉందని…ఆయన త్వరలోనే పార్టీ మారడానికి చూస్తున్నారని ప్రచారం నడుస్తోంది. గల్లా ఇప్పటికే బీజేపీ పెద్దలకు టచ్‌లో ఉన్నారని, ఆయన తన వ్యాపారాలని దృష్టిలో పెట్టుకుని బీజేపీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీలు చూసుకుని గల్లా బీజేపీలోకి జంప్ అయిపోతారని అంటున్నారు. కేవలం గల్లానే కాదు, రామ్మోహన్, కేశినేనిలు కూడా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం చాలాసార్లు జరిగింది. ఈ ముగ్గురు ఎంపీలు బీజేపీలోకి వెళ్తారని వార్తలు వచ్చాయి.

కానీ ఇంతవరకు పార్టీ మారతారనే సంకేతాలు ఇవ్వలేదు. అలా అని పార్టీ మార్పు వార్తలని ఖండించిన దాఖలాలు లేవు. అయితే ఈ ముగ్గురు ఎంపీలకు కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ బీజేపీలోకి వెళితే ఈ నాలుగేళ్ళు ఇబ్బంది ఉండదు ఏమో గానీ, ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి గెలవడం కష్టం. అందుకే ఈ ఎంపీలు బీజేపీలోకి వెళ్ళడం కష్టమని తెలుస్తోంది. పార్టీ మార్పు ప్రచారం…కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందని తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

-vuyyuru subhash