బాబు ప్రతిపక్ష హోదా నిలబెడుతున్న జగన్ ..!

-

2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. 175 సీట్లుకు గాను టీడీపీ 23 గెలుచుకోవడం వల్ల చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా వచ్చింది. సాధారణంగా మొత్తం సీట్లలో 10వ వంతు సీట్లు సాధిస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అంటే 175 సీట్లకు 17-18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. టీడీపీకి 23 రావడంతో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్నారు. అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసపెట్టి జగన్‌కు జై కొడుతున్నారు.

ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు టీడీపీని వీడి జగన్‌కు సపోర్ట్ చేశారు. తాజాగా విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కూడా జగన్‌ని కలిసి, ప్రభుత్వానికి మద్ధతు ఇస్తానని ప్రకటించారు. అంటే నలుగురు ఎమ్మెల్యేలు జగన్‌కు జై కొట్టడంతో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఇక ఇందులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జంప్ కొట్టేయోచ్చని తెలుస్తోంది. ఇక వారు జంప్ కొడితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోయే ఛాన్స్ ఉంది. కానీ జగన్ పెట్టుకున్న పాలసీ వల్ల బాబు హోదా పోయే అవకాశాలు లేవని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే జగన్ తమ పార్టీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేసి రావాలనే కండిషన్ పెట్టుకుని ఉన్నారు. అయితే టీడీపీని వీడే ఎమ్మెల్యేలు సొంత తెలివితేటలు ఉపయోగించారో లేక వైసీపీ అధిష్టానం ప్లాన్ ప్రకారం నడుస్తున్నారో తెలియదు గానీ, తమ పదవులకు రాజీనామా చేయకుండా, అధికారికంగా వైసీపీలో చేరకుండా జగన్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు పదవులకు రాజీనామా చేయవసరం లేదు.

అదే సమయంలో వీరు ఇంకా అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. అంటే టీడీపీ కింద 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లే అని, కాబట్టి బాబు ప్రతిపక్ష హోదా పోయే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఒకవేళ టీడీపీ శాసనసభపక్షాన్ని వైసీపీలో విలీనం చేయాలి. అలా చేయాలంటే టీడీపీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్ధతు ఉండాలి. కానీ అలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news