ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ సీపీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కి త్వరలోనే కీలక అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారా? ఈ మేరకు ఇప్పటికే స్కెచ్ సిద్ధం చేసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు వైఎస్సార్ సీపీ నాయకులు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటు వ్యవహారాల పార్టీ నేతగానే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ సీపీ కన్వీనర్‌గా కూడా విజయసాయిరెడ్డి కీలక రోల్ పోషిస్తున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు నుంచి పార్టీని అధికారంలోకి తీసుకువ చ్చేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నారు. పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు పార్టీలో తలెత్తే సమస్యలను కూడా పరిష్కరించడంలోనూ ఆయన ముందున్నారు.
దీంతో వైఎస్సార్‌సీపీలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సాయిరెడ్డి వాలిపోవడం, వాటిని పరిష్కరించడం పరిపాటిగా మారింది. ఇక, ఇప్పుడు కీలకమైన అమరావతి తరలింపు విషయం నేపథ్యంలో పార్టీ గుంటూరు, కృష్నా, ప్రకాశం జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉంది. గతంలో ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని, తితలీ తుఫాను శ్రీకాకుళాన్ని ముంచెత్తినప్పుడు.. పక్కనే పాదయాత్ర చేస్తున్న జగన్ వెళ్లి పలుకరించలేదని విమర్శలు వచ్చినప్పుడు కూడా సాయిరెడ్డి ఇక్కడి జిల్లాల్లోపార్టీని నిలబెట్టారు. గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడ పార్టీ జోరుగా ముందుకు సాగింది.
ఇదే వ్యూహంతో ఇప్పుడు ప్రమాదఘంటికలు వినిపిస్తున్నాయని అంటున్న అమరావతి రాజధాని విషయంలోనూ సాయిరెడ్డిని రంగంలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే, ఆ మూడు జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కన్వీనరుగా సాయిరెడ్డిని నియమించడం ద్వారా.. ఇక్కడ అమరావతి వ్యతిరేకతను తగ్గించడంతోపాటు, పార్టీ నేతల్లో స్థయిర్యం కల్పించి, పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయనైతేనే కరెక్ట్ అనే భావన కనిపిస్తోంది.
పైగా ఈ మూడు జిల్లాల్లోనూ ఓటు బ్యాంకు అత్యంత కీలకం కానుండడం, సాయిరెడ్డి అయితే.. ఇక్కడి పరిస్థితులను హ్యాండిల్ చేస్తారనే నమ్మకం జగన్ కు ఉండడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సాయిరెడ్డికి పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు పార్టీ నేతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాయిరెడ్డికి పెద్ద అగ్నిపరీక్షగానే భావించాలి. అయితే, ప్రస్తుతం సాయిరెడ్డి కరోనా భారిన పడి ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన త్వరలోనేకోలుకుని రాజకీయాలు ప్రారంభించగానే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.