రాజకీయాల్లో వ్యూహాలు ఎవరిసొత్తూ కాదు. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసేందుకు పార్టీల నాయకులు పైఎత్తులు ఎప్పుడూ వేస్తూనే ఉంటారు. వాటిని అధిగమించాల్సిన అవసరం ప్రత్యర్థి పార్టీలపై ఎప్పుడూ ఉంటుంది. కానీ, ఏపీలో ఏమైందో ఏమో.. ప్రతి పక్షం టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అధికారపక్షం వైసీపీ వేస్తున్న వ్యూహాలను గమనించలేక పోతున్నారు. ఒకవేళ గమనించినా.. ఆయన దానికి తగిన విధంగా పై ఎత్తులు వేయలేక పోతున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీలో నెంబర్-2గా ఉన్న యనమల రామకృష్ణుడుని మట్టి కరిపించేలా.. ఆయన సొంత నియోజకవర్గం లో యనమల పేరు సహా పార్టీ ని కూడా తుడిచి పెట్టేలా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
యనమల కుటుంబానికి, టీడీపీకి పట్టుకొమ్మగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో వైసీపీ పాగా వేసింది. అంతేకాదు, జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ హవా మసకబారేలా జగన్ వ్యూహాత్మకంగా కాపు కార్పొరేషన్‌కు ఈ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్నదాడిశెట్టి రాజాను చైర్మన్‌గా నియమించారు. వాస్తవానికి తుని నియోజకవర్గంలో కాపుల దే హవా నడుస్తోంది. అలాంటి చోట.. కాపు వర్గానికి చెందిన రాజాను జగన్ బరిలో నిలిపి.. వారి కార్పొరేషన్‌కు రాజానే నియమిం చారు. దీంతో రాజా దూకుడుగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు.
ఏడాదికి 400 కోట్లు కూడా చంద్రబాబు ఖర్చు చేయలేదు. కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పి మోసం చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టాలని అడిగితే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారు. అంటూ.. చంద్రబాబును ఏకేస్తున్నారు. అదే సమయంలో కాపువర్గానికి అత్యంత చేరువ అయ్యారు. జగన్ ఆశించింది ఇదే! తునిలో యనమల వర్గానికి చెక్ పెట్టడమే. మరి దాడిశెట్టి రాజా.. తన ప్రభుత్వం, సీఎం జగన్.. కాపులకు ఎంతో చేస్తున్నారని చెబుతూనే.. బాబుపై నిప్పులు చెరుగుతుంటే .. దాడిశెట్టి రాజా సవాళ్లు రువ్వుతుంటే.. యనమల వర్గం మౌనం పాటిస్తోంది. కాపులకు బాబు ఇది చేశారు.. అది చేశారు.. అని చెప్పుకొనేందుకు కూడా వెనుకాడుతోంది.
పైగా.. వరుస ఓటములతో పార్టీ కేడర్ కూడాదాదాపు చెల్లాచెదురైంది. అంతేకాదు.. కాపులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాపేతర నాయకుడు యనమలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని వైసీపీ ప్రశ్నిస్తున్నా.. సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో టీడీపీ ఉంది. మొత్తంగా జగన్ వేసుకున్న యనమల టార్గెట్ ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతున్నా.. చంద్రబాబు మాత్రం దీనిని గమనించకపోవడం, పార్టీని రక్షించుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.