రసాయన అవశేషాలు లేని పంటల ధ్రువీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించే రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులను తీర్చిదిద్దేందుకు 2019లో శ్రీకారం చుట్టిన వైఎస్సార్ పొలం బడులను ప్రామాణికంగా తీసుకొని జిఏపి సర్టిఫికేషన్ జారీ చేయనుంది.
కాగా 2022-23 సీజన్ లో 17వేల పొలంబడుల ద్వారా 5.10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గడచిన ఖరీఫ్ సీజన్ లో 8,509 పొలం బడుల ద్వారా 2.55 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా, ప్రస్తుత రబీ సీజన్ లో 7,991 పొలంబడుల ద్వారా 2.4 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా వరిలో 2,828, అపరాల్లో 2,720, వేరుశనగలో 1,220, మొక్క జొన్నలో 834, నువ్వులులో 223, చిరుధాన్యాల్లో 142, పొద్దుతిరుగుడులో 24 పొలంబడులు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.