నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్లు ఎత్తు వరకు ఊపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఊపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.
ఇది వాయువ్య దిశగా కదులుతూ 12వ తేదీ వరకు తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతానికి విస్తరిస్తుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి విడుదల చేసిన బులెట్ లో వెల్లడించింది. ఈ ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తారు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.