త్వరలోనే తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ నుంచి గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు.. హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు మాసాల్లోనే ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి ఇలాంటి ఎన్నికల్లో సానుభూతి కోసం.. ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉండే సంప్రదాయం ఉండేది. అయితే, ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీలు ఈ సంప్రదాయానికి దాదాపు శుభం కార్డు వేశాయి. ఈ నేపథ్యంలో పార్టీలు అన్నీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.
ఇక, అధికార పార్టీ విషయానికి వస్తే.. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. సీఎం జగన్ ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేస్తుండడం. మూడు రాజధానులు, కర్నూలులో హైకోర్టు, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన వంటివి ఉండడంతో ప్రజానాడిని తెలుసుకునేందుకు ఈ ఎన్నికలను అందివచ్చిన అవకాశంగా భావిస్తోంది. ఇక, ప్రతిపక్షాలు కూడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో బహుశ .. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలావుంటే, సంప్రదాయంగా వస్తున్న మరణించిన నాయకుడి తాలూకు కుటుంబానికి టికెట్ ఇవ్వాలనే విషయాన్ని వైసీపీ ఈ దఫా పక్కన పెడుతోంది. దీనికి దుర్గా ప్రసాదరావు కుటుంబం కూడా కారణమని తెలుస్తోంది. ఆ కుటుంబం నుంచి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తిరుపతి పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వుడు కావటంతో.. స్థానికంగా ఎవరూ బలమైన నాయకుడు లేకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన మధు అనే పారిశ్రామికవేత్తను వైసీపీ ఇక్కడ నుంచి నిలబెడుతుందని అంటున్నారు.
ఇప్పటికే మధు పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఆర్తికంగా బలంగా ఉండడం, ఎస్సీ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకొనే అవకాశం ఉండడం, జగన్‌కు వీరాభిమాని కూడా కావడం మధుకు కలిసి వస్తున్నాయని అప్పుడే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధు పేరు ఖరారు కావడం ఖాయమని అంటున్నారు వైసీపీ నాయకులు. మరి ఏం చేస్తారో చూడాలి.