చినబాబు కి పెద బాబు ‘ ఓదార్పు ‘ ! ఆ టైమ్ వచ్చేసిందిలే ?

తెలుగుదేశం పార్టీ కీలక నాయకులంతా వివిధ కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లడం, బెయిల్ పై బయటకు రావడం, వంటి సంఘటనలు షరా మామూలు అయిపోయాయి. కీలక నాయకులు అరెస్ట్ అవడంతో చంద్రబాబు వారిని పరామర్శించేందుకు వారి ఇళ్లకు వెళ్లి మరి ఓదార్పు చేస్తున్నారు. 70 ఏళ్లు దాటినా, కరోనా భయం వెంటాడుతున్నా, చంద్రబాబు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఇళ్లకు వెళ్లి ఓదార్పు చేస్తున్నారు. అలా చేయకపోతే పార్టీ తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఆ కీలక నాయకులు వస్తే మొదటికే మోసం వస్తుందని, వారు పార్టీ మారేందుకు సైతం వెనకాడర ని, పైగా తన పైన, తన కుమారుడు లోకేష్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారని, ఇలా ఎన్నో అభిప్రాయాలతో చంద్రబాబు ఓదార్పు లు చేసుకుంటూ వస్తున్నారు.
ఇప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వ్యవహారంపై వైసిపి పూర్తిగా దృష్టి పెట్టింది. పదేపదే సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తుండటం, అంతర్వేది సంఘటన విషయంలో ప్రభుత్వ పరువు తీసే విధంగా మాట్లాడుతూ ఉండడం వంటి వ్యవహారాలపై కొద్దిరోజులుగా వైసిపి ప్రభుత్వం ఆగ్రహం గానే ఉంది. ఈనేపథ్యంలో లోకేష్ దూకుడు తగ్గించడంతో పాటు, ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని, ప్రజల్లో లోకేష్ అసమర్థుడు, అవినీతిపరుడు అని ముద్ర వేయాలని ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
దీనిలో భాగంగానే గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి గా లోకేష్ పని చేయడం, అప్పట్లో ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో లోకేష్ భారీగా అవినీతికి పాల్పడ్డారనే విషయం కొన్ని ఆధారాలతో సహా వైసీపీ ప్రభుత్వం సేకరించడం, మంత్రివర్గ ఉప సంఘం ఈ వ్యవహారంలో రెండు వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని తేల్చడంతో, ఇప్పుడు సీబీఐ ను రంగంలోకి దించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ కేసును దర్యాప్తు చేయవలసిందిగా లేఖ సైతం రాశారు. ఇక రథం దగ్ధం సంఘటనపై హిందూ మనోభావాలను జగన్ రెడ్డి దెబ్బతీశారంటూ పదే పదే విమర్శలు చేస్తుండడంతో, గత టిడిపి ప్రభుత్వ హయాంలో లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు విజయవాడ దుర్గమ్మ గర్భగుడి లో క్షుద్రపూజలు చేయించారు అంటూ, అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై అప్పటి టిడిపి ప్రభుత్వం అంతా ఉత్తిదే అని తేల్చేసింది. కేవలం ఆలయ ఈవో సూర్యకుమారిని బదిలీ చేసి ఆ వ్యవహారానికి పులిస్టాప్ పెట్టింది.
దీనిపై వైసీపీ అప్పట్లోనే పెద్ద రాద్ధాంతం చేసినా, అప్పటి టిడిపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రథం ఈ వ్యవహారంలో లోకేష్ తమను పదేపదే టార్గెట్ చేసుకోవడంతో, ఇప్పుడు విజయవాడలో జరిగిన క్షుద్ర పూజల వ్యవహారాన్ని బయటపెట్టేందుకు, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస వరుసగా ఏపీ ప్రభుత్వం లోకేష్ విషయంలో ఇంత సీరియస్ గా దృష్టి పెట్టడంతో, ఆయన త్వరలోనే ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే లోకేష్ కు చంద్రబాబు ఓదార్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.
-Surya