ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఆ విధంగా ఆయన రాక సంబంధిత నిర్ణయాలు ఓ చరిత్ర కావాలని పరితపిస్తున్నారు ఇక్కడి నేతలు. ఇప్పటిదాకా ఇక్కడ పెండింగ్-లో ఉన్న పనులకు సంబంధించి ఏ మేరకు క్లియరెన్స్ ఇస్తారో అన్న ఆసక్తి ఒకటి నెలకొని ఉంది. సీఎం రాకతో శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రైల్వే స్టేషన్ వరకూ నాలుగు వరుసల రహదారికి మోక్షం దక్కుతుందని భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు సంబంధిత పనులకు ఆయన ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా మరిన్ని ప్రధాన రహదారులకూ సీఎం నిధులు ఇస్తే బాగుంటుంది అన్న వాదన ఉంది సీఎం వస్తున్నారు కనుక కొన్ని రోడ్లకు తాత్కాలికంగా మరమ్మతులు అయితే చేపట్టారు. కొన్నిచోట్ల కాస్తో కూస్తో పనులు అప్పటికప్పుడు చేపట్టారు. ఇందులో భాగంగా డివైడర్లకు రంగులు వేసి మమ అనిపించేశారు. కానీ చేయాల్సింది ఎంతో ఉంది.
ముఖ్యంగా సీఎం ఇక్కడికి వస్తున్నారు కనుక రిమ్స్ లో తనిఖీలు చేపట్టి, ఇక్కడి సమస్యలు వింటే బాగుంటుంది అన్న వాదన కూడా ఉంది. అదేవిధంగా టెక్కలి జిల్లా ఆస్పత్రికి నిధులు ఇస్తే, కాస్తో కూస్తో ఆ ప్రాంత వాసులకు నాణ్యమయిన వైద్యం అందుతుంది అన్న డిమాండ్ కూడా ఉంది. విద్యా రంగానికే సంబంధించి మాట్లాడితే కొన్ని బడులు ఇప్పటికీ కనీస వసతులు లేకుండానే ఉన్నాయి. వీటిపై ఆయన ఏమయినా మాట్లాడతారా అన్న ఆసక్తి కూడా ఇప్పుడు నెలకొని ఉంది. మరోవైపు
ముందస్తు ఖరీఫ్ సీజన్ ఆరంభం అవుతున్నందున రైతాంగానికి సంబంధించి,ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఏమయినా చెప్పి, 4 రూపాయలు విడుదల చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అదేవిధంగా కోడిరామ్మూర్తి స్టేడియం పనులకు సంబంధించి అధికారులకు ఏమయినాసూచనలు చేసి వెళ్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాకు ఇవాళ (జూన్ 27, 2022 ) యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వరాలేమ యినా ఇస్తారా అన్న ఆశతో ఇక్కడి ప్రజలంతా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా వంశధార నిర్వాసితులకు మళ్లీ పరిహారం చెల్లించ డంతో అక్కడి వర్గాలు కాస్త ఊరట చెంది ఉన్నాయి కానీ ప్రాజెక్టు పనుల్లో వేగం మాత్రం లేదు అన్న వాదన ఉంది. మొన్నటి వేళ హిరమండలంలో వంశధార నిర్వాసితులతో ప్రభుత్వ ప్రతినిధులు సమావేశం అయి, 216.71 కోట్ల రూపాయలను 27 వేల మంది లబ్ధిదారులకు అందించారు. దీంతో కాస్త సమస్య పరిష్కారం అయినా నిర్వాసితుడే తొలి లబ్ధిదారుడు అన్న నినాదంకు కాస్త న్యాయం దక్కినా, నిర్వాసిత గ్రామాలలో కనీస సౌకర్యాల కల్పనకు ఏ పాటి చర్యలు తీసుకోనున్నారో అన్నది ఇప్పుడిక ఆసక్తిదాయకం.