వైసీపీ లో మరో అనీల్ వచ్చారు. ఆ విధంగా నెల్లూరు కేంద్రంగానే ఒక రాజకీయం మొదలు కానుంది. ఇప్పటిదాకా ఉన్న రాజకీయం ఆగిపోయి కొత్త రాజకీయం ప్రారంభం అయింది. పదవి అందుకున్న కొత్తల్లో అనీల్ ఏ విధంగా ఉండేవారో., పదవిలో నుంచి దిగి పోయేంత వరకూ అనీల్ ఎలా ఉండేవారో ఈయన కూడా అలానే ఉంటున్నారు. ఉండబోతున్నారు. హీ ఈజ్ నన్ అదర్ దేన్ కాకాణి గోవర్థన్ రెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రి. పదవి రానంత వరకూ పెద్దగా మాట్లాడని ఆయన ఇప్పుడు నోరు జారుతున్నారు. రైతాంగ సమస్యలు ప్రస్తావించినా వాటిని అర్థం చేసుకోకుండా ఇదంతా విపక్షాల రాద్ధాంతం అని కొట్టి పారేస్తున్నారు. ఆ విధంగా కొణిదెల వెర్సస్ కాకాణి అన్న విధంగా రాజకీయం ముందున్న కాలంలోనూ షురూ కానుంది.
వాస్తవానికి మొన్నటి వరకూ కౌలు రైతులపై వారి సమస్యలపై మాట్లాడిన జనసేనాని తాజాగా పంట విరామంకు సంబంధించి, కోనసీమలో నెలకొన్న సమస్యలు గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు వైసీపీకి కంటగింపుగానే ఉన్నాయి.అందుకే మంత్రికి కూడా కోపం ఎక్కువగానో లేదా జాస్తిగానో ఉంది. అందుకే ఆయన చంద్రబాబుతో పవన్ కు ప్యాకేజీ కుదిరిందని ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని జనసేన మండిపడుతోంది. గత ఎన్నికల్లోనూ తాము ఎవరి దగ్గరకూ వెళ్లలేదని, ఎవరి వెంటా పడలేదని తమ దగ్గరకే టీడీపీ వచ్చిందని గుర్తు చేస్తూ, మంత్రులు మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు చెబుతోంది. గతంలో తమ నేతను ఉద్దేశించి ఇదే విధంగా అనీల్ మాట్లాడేవారని, ముందూ వెనుకా చూడకుండా చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఇవాళ ఆయన మంత్రి పదవి కోల్పోయి ఇంటికే పరిమితం అయ్యారని విమర్శలు చేస్తోంది. అదేవిధంగా కాకాణి కూడా ప్యాకేజీకి సంబంధించి అర్థం పర్థం లేని విధంగా మాట్లాడితే జనం ఆయన్ను ఇంటికే పరిమితం చేయడం ఖాయమని అంటున్నారు జనసేన అభిమానులు. మరోఅనీల్ మాదిరిగా కాకాణి ప్రవర్తించకూడదని హితవు చెబుతోంది.