గన్నవరం టికెట్‌పై రగడ.. యార్లగడ్డ V/S వల్లభనేని వంశీ

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌కు సంబంధించిన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ తనదంటే.. తనదని ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్‌కు తాను బాగా తెలుసని.. ఎమ్మెల్యే సీటు తనకే కన్‌ఫర్మ్ అని వల్లభనేని చెబుతున్నారు. అయితే తనకు కూడా ఎమ్మెల్యే టికెట్ కన్‌ఫర్మ్ గా వస్తుందని యార్లగడ్డ అంటున్నారు. గన్నవరంలో గతంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు, జగన్‌పై తిట్టలేదని ఆయన పేర్కొన్నారు.

యార్లగడ్డ-వల్లభనేని
యార్లగడ్డ-వల్లభనేని

యార్లగడ్డ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ మద్దతు తనకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గానికి నేను ఏం చేశానో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. మట్టి తవ్వకాలపై అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నారని వల్లభనేని వంశీ విమర్శించారు. గన్నవరంలోని మట్టిని కుప్పం వరకు ఎలా తరలిస్తామని ప్రశ్నించారు. మట్టిని తరలించాలంటే.. దానికి ఎక్కువగా డీజిల్‌కే ఖర్చు అవుతుందని తెలిపారు.