ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో మూడు కీలకమైన అంశాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. వాటిలో ఒకటి పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు – సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించుకోవడం ఒకటి కాగా… నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడం – నియమించకపోవడం రెండోది… ఇవన్నీ ఒకెత్తు అయితే ఆషాడం అయిపోతోంది.. శ్రావణం వచ్చేస్తోంది.. మంచిరోజుల ముహూర్తాలకు కాలం వచ్చేస్తోంది.. మరి మంత్రి పదవుల సంగతేమిటి అని ఆశావహుల హడావిడి!
మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు వెళ్లడం ద్వారా ఖాళీ అయిన రెండు కీలక మంత్రిపదవులను ఆషాడం వెళ్లగానే భర్తీ చేయాలని జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు పదవుల కోసం ఎవరిస్థాయిలో వారు కలలు కంటూ.. అధినేత దృష్టిని ఆకర్శించే పనులు చేస్తూ.. మరికొందరు మీడియాలో హడావిడి చేస్తూ.. మరికొందరు బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే!
ఈ క్రమంలో ఈ రెండు మంత్రిపదవులూ బీసీలకే ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలియగానే… మిగిలిన సామాజికవర్గాల వారు “బెటర్ లక్ నెక్స్ట్ టైం” అని ఎవరికి వారనుకుంటూ చల్లబడిన నేపథ్యంలో… ఇంతకాలం సైలంట్ గా ఉన్న బీసీ నేతల్లో మాత్రం కొంతమందికి కొత్త ఉత్సాహం వచ్చిందని చెబుతున్నారు. వారిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఒకరు!!
ఒకపక్క జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన రెండు బిల్లులనూ ఆమోదించుకునే టెన్షన్ లో కొట్టుమిట్టాడుతుంటే… “అధ్యక్షా వద్దు.. అమాత్యా ముద్దు” అంటూ లైన్ లోకి వచ్చారంట సీతారం. తనను అంతా “అధ్యక్షా” అని పిలవడం గౌరవంగా ఉన్నా తమ్మినేనికి అది అంత సంత్రుప్తిని ఇవ్వడంలేదంట. అంతా తనను “అమాత్యా” అని పిలవాలన్న ధ్యాస, ఆశలే శ్వాసగా నడుస్తున్నయంట. ఈ క్రమంలో ఈ మధ్యనే జగన్ ని సతీసమేతంగా కలసి మరి తన విన్నపాన్ని తెలియచేశారని కూడా ప్రచారం సాగుతోంది! ఈ క్రమంలో ఈయన సీరియస్ గా తీసుకున్న ఈ నిర్ణయంపై చేసిన విన్నపంపై.. జగన్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది!!