డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి‌ పై ఫోకస్ పెట్టిన బీజేపీ

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి‌ టార్గెట్ గా రాజకీయం మొదలెట్టింది ఏపీ బీజేపీ. పుష్పశ్రీవాణి కొండదొర సామాజికవర్గం కాదంటూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు. దీంతో విజయనగరం ఏజెన్సీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే ఒకసారి పుష్పశ్రీవాణి సామాజికవర్గం పై ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వగా ఇప్పుడు బీజేపీ నేత ఫిర్యాదుతో కోర్టు తీర్పుపై టెన్షన్ నెలకొంది.

పాముల పుష్పశ్రీవాణి విజయనగరం జిల్లా కురుపాం వైసీపీ ఎమ్మెల్యే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం. 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుసగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రాజు కోడలు కావడంతో.. ఆ ఈక్వేషన్స్‌ కూడా కలిసి వచ్చాయని చెబుతారు. గెలిచిన రెండోసారే కేబినెట్‌లో చోటు దక్కించుకోవడం..ఏకంగా డిప్యూటీ సీఎం కావడంతో ప్రాధాన్యం పెరిగింది. గతంలో విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ ధాట్రాజులు ఎస్టీలు కాదని కోర్టుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీనేత నిమ్మక జయరాజు ఇప్పుడు పుష్పశ్రీవాణి కులాన్ని కోర్టులో సవాల్‌ చేశారు.

పుష్పశ్రీవాణి కొండదొర సామాజికవర్గం కాదన్నది జయరాజు ఆరోపణ. ఇదే అంశాన్ని ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం ఖండించారు. తనది కొండదొర సామాజికవర్గంగా గట్టిగా చెబుతున్న ఆమె.. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ సమస్యను తెరపైకి తీసుకొచ్చారని మండిపడుతున్నారు. తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ కారణంగా తన సోదరి తులసి పశ్చిమ గోదావరి జిల్లాలో టీచర్ ఉద్యోగం కోల్పోలేదని.. నాన్‌ లోకల్‌ కావడం వల్లే ఇబ్బంది వచ్చిందని తెలిపారు పుష్పశ్రీవాణి.

2014లోనే తన కుటుంబం మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చారని ఆమె గుర్తు చేస్తున్నారు. అప్పటికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. దీని పై నిమ్మక జయరాజు వాదన మరోలా ఉంది. పుష్పశ్రీవాణి పూర్వీకులు పశ్చిమగోదావరి జిల్లా దొరమామిడి గ్రామానికి వారు వలస వెళ్లారని పుష్పశ్రీవాణి తండ్రికి చెందిన రికార్డుల్లో ఎక్కడ కొండదొర అని లేదని.. కొండ కులం అని మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు జయరాజు. కొండ కులం అనే సామాజికవర్గం ఎస్టీ ఉప కులాల్లో లేదన్నది ఆయన వాదన. వీటికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందజేసినట్టు తెలిపారు జయరాజు.

జయరాజు వేసిన పిటిషన్ల కారణంగానే శత్రుచర్ల విజయరామరాజు, జనార్దన్‌ థాట్రాజులు ఎస్టీలు కాదని కోర్టులు తీర్పులు ఇచ్చాయి. దాంతో పుష్పశ్రీవాణిపై ఆయన వేసిన తాజా కేసు ఇప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.