బీజేపీ సీరియస్ ఫైట్‌ను కొందరు షోగా మార్చేశారా

-

రామతీర్థం ఉద్యమం విషయంలో ఇప్పటికే రెండుసార్లు రోడ్డెక్కింది ఏపీ బీజేపీ. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నాయకులు ఇందులో భాగమయ్యారు. తొలిరోజు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో రెండో రోజు చలో అంటూ పిలుపు ఇచ్చారు. ముట్టడి.. అరెస్ట్‌లతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరుపై ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు కమలనాథులు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఉద్యమంపై బీజేపీలో జరుగుతున్న చర్చే కాస్త భిన్నంగా ఉంది. పోరాటం సందర్భంగా కొందరు వ్యవహరించిన తీరుపై పార్టీ ముఖ్య నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారట.

విజయసాయిరెడ్డి, చంద్రబాబు వెళ్తే లేనిది తమనెందుకు వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు నాయకులు. అంత వరకు ఓకే కానీ రెండోసారి వెంటనే చలో రామతీర్థం అని పిలుపివ్వడం ఒకటైతే.. మీడియాలో కనిపించేందుకు ఆ నిరసన కార్యక్రమాన్ని ఒక షోలా మార్చేశారన్నది బీజేపీలోనే వినిపిస్తున్న మాట. దీనివల్ల హడావిడి జరిగింది కానీ.. ప్రజల అటెన్షన్‌ రాలేదని కొందరు వాదిస్తున్నారట. రెండోసారి నిర్వహించిన నిరసనలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇంత మంది పాల్గొన్న ఉద్యమం ఒకరిద్దరు నాయకుల అత్యుత్సాహం వల్ల షోగా మారి అభాసుపాలైందని సీనియర్లు రుసరుసలాడుతున్నారట.

ఏదైనా నిరసన అన్నాక తొక్కిసలాటలు, పోలీసుల అరెస్ట్‌లు కామన్‌. కానీ.. ఆస్పత్రిలో చేరికలు.. పరామర్శలు శ్రుతిమించాయన్నది వారు చెబుతున్న మాట. అంతర్వేది రథం దగ్ధం విషయంలో సోము వీర్రాజు తదితర బీజేపీ నేతలు చేసిన ఫైట్‌ అప్పట్లో మంచి పేరు తెచ్చిందని పార్టీ అనుకుంటున్నారు. రామతీర్థం విషయంలో మాత్రం పార్టీ ఆలస్యంగా మేల్కొంది. టీడీపీని బీట్‌ చేయాలనే ఉద్దేశంతో రెండురోజులు కదం తొక్కింది. మొదటి రోజు ఫర్వాలేదని అనిపించినా.. రెండోరోజు సిత్రాలే ఎబ్బెట్టుగా ఉన్నాయట. మొత్తం కార్యక్రమాన్ని డ్రామాగా మార్చేశారని బీజేపీలో ఓ రేంజ్‌లోనే చర్చ జరుగుతోందట. ఉత్తరాంధ్రకు చెందిన ఓ నాయకుడైతే ఈ మొత్తం ఎపిసోడ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

పార్టీ కార్యక్రమం చేస్తే బీజేపీ జనాల్లో రిజిస్టర్‌ అవ్వాలి కానీ.. వ్యక్తులు కాదని కాషాయ శిబిరంలోని ఓ వర్గం అభిప్రాయపడుతోందట. కొందరు నేతల తీరు చూస్తే పబ్లిసిటీ కోసం చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడుతున్నట్టు ప్రజలకు ఈజీగా అర్థమవుతోందని మండిపడ్డారట. అసలు ఇలాంటి విధానం పార్టీ సిద్ధాంతాలకు పనితీరుకు వ్యతిరేకమని గుర్తు చేస్తున్నారట. సొమ్మసిల్లి పడిన సమయంలో కొందరు అప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి, సహాయ మంత్రులకు ఫోన్‌ చేయడం.. వారు ఆరా తీశారు అని బయటకు లీక్‌ చేయడంపై బీజేపీలో అసంతృప్తి వ్యక్తమవుతోందట.

మొత్తానికి ఏపీ బీజేపీకి కొత్త కమిటీ వచ్చిన తర్వాత కొందరు నాయకుల అత్యుత్సాహంపై పార్టీలో లుకలుకలు పెరుగుతున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news