బీజేపీ విమర్శలపై టీఆర్‌ఎస్‌ మౌనం అందుకేనా ?

-

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు ఓ రేంజ్‌లో పేలాయి. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత కూడా కొంత వేడి కొనసాగింది. మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చినా.. బీజేపీ విమర్శలకు కౌంటర్లు వేశారు అధికార పార్టీ నాయకులు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. మునుపటిలా కాషాయ పార్టీపై విమర్శలు చేయలేని పరిస్థితి ఉందట. కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతుండగానే ఉన్నట్టుండి ప్రెస్ మీట్లు కూడా రద్దవుతున్నాయట…

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. ఆ భేటీలపై కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంది టీఆర్‌ఎస్‌. అవి రాజకీయ భేటీలు కాదని.. రాజ్యాంగ పరిధిలో జరిగిన సమావేశాలుగా తేల్చింది అధికారపార్టీ. బీజేపీ మాత్రం దూకుడు తగ్గించలేదు. టీఆర్‌ఎస్‌ నుంచి ఆ స్థాయిలో కౌంటర్లు రావడం లేదు. ఆ మధ్య వరంగల్‌లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడదామని భారీ ఏర్పాట్లు చేసి వెనక్కి తగ్గారు గులాబీ నేతలు. ఆ ఘటన మర్చిపోకుండానే ఇప్పుడు ఇంకో అంశం తెరపైకి వచ్చింది.

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఖమ్మం పర్యటనలో మంత్రి పువ్వాడ అజయ్‌పైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. పువ్వాడను ఉద్దేశించి ఆయన పరుష పదజాలమే ఉపయోగించారు. ఈ విమర్శలపై కౌంటర్‌ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రెడీ అయ్యారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు మీడియాకు సమాచారం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్‌లు మీడియాతో మాట్లాడతారని ఆ సందేశంలో ఉంది. అయితే ఆ వెనువెంటనే మీడియాకు మరో సందేశం వచ్చింది. మీడియా సమావేశం రద్దయిందని ఆ సందేశంలో ఉంది.

ఇప్పుడిదే కొత్త చర్చకు దారితీస్తోంది. మీడియా సమావేశం ఎందుకు పెట్టారు. ఎందుకు రద్దు చేశారన్నది మిస్టరీగా మారిందట. బీజేపీ నుంచి వస్తోన్న విమర్శలను తిప్పికొట్టే విషయంలో టీఆర్‌ఎస్‌ నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారా అన్న చర్చ మొదలైంది. వ్యూహాత్మక మౌనమే కరెక్ట్‌ అని టీఆర్‌ఎస్‌ భావిస్తోందా? సమయం చూసి దీటుగా బదులివ్వాలని అనుకుంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో పార్టీ నేతలకు, కేడర్‌కు ఏం అర్థం కావడం లేదన్నది తాజాగా జరుగుతున్న చర్చ.

Read more RELATED
Recommended to you

Latest news