అత్యాచారాలు అలా కొన్ని జరుగుతూ ఉంటాయి అని అంటున్న ఓ అమాత్యురాలు.. నిజంగానే, నిజంగానే లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించే పనిలో ఉన్నారని అనుకోవాలా? లేదా కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయి, పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకురాకుండా ప్రేక్షక పాత్రకు పరిమితం అయి ఉంటున్నారని భావించాలా ? ఒకటి కాదు రెండు కాదు వరుస నాలుగు ఘటనలు.. వైసీపీ సర్కారు పరువు తీశాయి. ఇదేమని అడిగితే టీడీపీ నాయకులపై ప్రతిగా కొన్ని కేసులు నమోదయ్యాయి. రేపల్లె ఘటనకు సంబంధించి ఆమె ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఆమె అసలు ఉద్దేశం ఏంటి ?
నిందితులు అత్యాచారం చేయడానికి రాలేదని, వాళ్లు తాగి ఉన్నారని, డబ్బుల కోసమే ఆమె భర్తపై దాడి చేశారని, ఈ సందర్భంలో ఆమెను నెట్టేసిన విధానం, బంధించే సమయంలోనే అత్యాచారం జరిగిందని చెబుతూ మరికొన్ని మాటలు అనాలోచితంగా అన్నారు. అవే ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటున్నాయి. ఆమె మాటల ప్రకారమే ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో పేదరికం కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయా? అదేవిధంగా మానసిక పరిస్థితి బాగుండకనే అత్యాచారాలు జరుగుతున్నాయా ? ఇవే ప్రశ్నలు ప్రజా సంఘాలు సంధిస్తున్నాయి. ఓ మహిళ అయి ఉండి తోటివారి భద్రత, రక్షణ విషయమై చర్యలు తీసుకోకపోవడం అన్నది ఓ ప్రాథమిక కర్తవ్యం అని మరిచి మాట్లాడుతుండడం బాధాకరం అని వాపోతున్నాయి.
రాష్ట్రంలో ఏం జరిగినా బాధ్యత వహించాల్సిన వారు, అస్సలు ఆ విషయమే మరిచిపోయి మాట్లాడుతున్నారు. కన్నీళ్లను తుడిచి వారికి అండగా ఉండాల్సిన వారు తరుచూ కొన్ని గొడవలకు కారణం అవుతున్నారు. అయినా బాధితుల బాధను అర్థం చేసుకునే తీరు ఇది కాదు. అత్యాచారాలను నియంత్రించే క్రమంలో పోలీసు వ్యవస్థ పటిష్టం చేయాలి. కానీ రోజుకో మాట చెబితే లాభం ఉండదు. నష్ట నివారణ అన్నది సాధ్యం కాకపోవచ్చు కూడా ! బాధితులను పట్టించుకోవడం మానేసి, కొన్ని అర్థం లేని మాటలు చెప్పడం వల్ల హోం మంత్రి స్థాయి పెరగదు గాక పెరగదు.
హోం మంత్రి తానేటి వనిత కొద్ది రోజులు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే బెటర్. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా వివాదాలే అవుతున్నాయి. ఆమె స్థాయిని తగ్గిస్తున్నాయే తప్ప పెంచడం లేదు. బాధ్యత గల హోం మంత్రి ఈ విధంగా మాట్లాడడంతో తరుచూ మీడియాలో వివాదాలే వస్తున్నాయి తప్ప ఆమె కొత్తగా బాధితుల కోసం చేసిందేం లేదని తేలిపోతుంది. అత్యాచార బాధితుల విషయమై స్పందించి వారికి అండగా నిలవాల్సిన హోం మంత్రి మాత్రం రోజు కో మాట అంటున్నారు. ఆ మాట పోనీ అర్థవంతంగా ఉంటుందా అంటే అదీ లేదు. మొన్నటి వేళ తల్లుల పెంపకం కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఇప్పుడు బాధితుల మానసిక స్థితి, పేదరికం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని రేపల్లె ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.