బాల‌రాజన్నా మీరు గ్రేట్ : సీఎం జ‌గ‌న్ ఫోన్‌.. రీజ‌న్ ఇదే..!

-

మ‌న్యం నుంచి మ‌న్యం వ‌ర‌కు.. అన్న‌ట్టుగా మ‌న్యం నాడి తెలిసిన నాయ‌కుడిగా ఎదిగిన తెల్లం బాల‌రాజు.. గిరిజ‌న ప‌క్ష‌పాతిగా మారారు. గిరిజ‌న నాయ‌కుడిగా ఎదిగిన ఆయ‌న గ‌తంలోనూ, ఇప్పుడు కూడా వారి స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు. వారి ప‌క్షానే నిల‌బ‌డుతున్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అడవిబిడ్డల ఆకలితీర్చేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలను సమాయత్తం చేసి కొండలు, వాగులు, వంకలు దాటుతూ మారుమూల గిరిజన గ్రామాలకు చేరుకుని నిత్యావసర సరుకులు, కూరగాయలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీస్తున్నారు.

ఇలా ఇప్పటివరకు 56 గిరిజన గ్రామాల్లో పర్యటించి సుమారు రూ.75 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. ఇటీవ‌ల‌ మరో సాహసోపేతమైన పర్యటన చేశారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న బుట్టాయగూడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మోతుగూడెం గ్రామాన్ని సందర్శించారు. యాక్షన్‌ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిత్యావసర సరుకులు, కూరగాయలను 150 గిరిజన కుటుంబాలకు అందించారు. వాస్త‌వానికి మోతుగూడెం పర్యటన సాహసంతో కూడుకున్నది. ఎత్తయిన కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సరైన రహదారి లేని ఈ గ్రామానికి వెళ్లాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. దశాబ్దాలుగా ఈ గ్రామ గిరిజనులకు కాలిబాటే ఆధారం.

దివంగత సీఎం వైఎస్‌ హయాంలో కొంతమేర రహదారుల నిర్మాణం జరిగినా మరి కొంతమేర రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుపై ఎమ్మెల్యే బాలరాజు కొంత మేర ద్విచక్ర వాహనంపై, మరి కొంతమేర కాలినడకన నిత్యావసర వస్తువులు మోసుకుంటూ వెళ్లి మోతుగూడెం గిరిజనులకు అందించారు. గ్రామానికి చెందిన గోగుల కమలమ్మ అనే కొండరెడ్డి గిరిజన మహిళ ఇంట్లో గొడ్డు కారంతో భోజనం చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. మొత్తంగా గిరిజ‌న బిడ్డ‌గా వారి ఓట్ల‌తో సంపాయించుకున్న అధికారాన్ని తిరిగి వారికే వినియోగిస్తూ.. గిరిజ‌నుల ప‌క్ష‌పాతిగా మారారు. ఈ విష‌యంపై తాజాగా సీఎంవోలో చ‌ర్చకు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. బాల‌రాజు సేవా దృక్ఫ‌థంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన సీఎం జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు స్వ‌యంగా ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news