రాజకీయాల్లో ఇద్దరూ స్నేహితులు. ఒకరి ఇంటికి ఒకరు వచ్చారు. ఒకరి ఇంట్లో ఒకరు అన్నాలు తిన్నారు. పండగ చేసుకున్నారు. ఒకరి కార్యక్రమాలకు ఒకరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు వారివురూ.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. నువ్వా-నేనా అనేరేంజ్‌లో రాజకీయాలకు కూడా సిద్ధమయ్యారు. వారే.. ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇద్దరూ కూడా ఇప్పుడు కత్తులు నూరుకుంటున్నారు. దీనికి కారణం.. గురువారం! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం.
నీటి విషయంలో ఏర్పడిన వివాదం.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య బహిరంగంగా మాటల యుద్ధానికి తెరదీయకపోయినా.. గురువారం జరిగే జాతీయస్థాయి పంచాయతీపై మాత్రం ఉత్కంఠ రేపుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచుతానని జగన్ అంటున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల వద్ద తెలంగాణ నీళ్లను మొత్తం తోడేస్తోందని, దీనివల్ల సీమ ప్రాంతలకు నీరు చేరడం లేదని, సగం జిల్లాలు అల్లాడుతున్నాయని.. దీంతో పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచి.. ఇక్కడి ప్రజలకు నీరు అందిస్తానని జగన్ చెబుతున్నారు.
అయితే, ఈ విషయంలో ఆది నుంచి అభ్యంతరం చెబుతున్న కేసీఆర్.. ఇది విభజన హామీలకు వ్యతిరేకమని చెప్పారు. మా నీళ్లను చుక్కకూడా వదులుకోబోమని, సీఎం జగన్ మిత్రుడే అయినా.. నీళ్ల విషయంలో మాత్రం కాదని చెప్పుకొస్తున్నారు. అయితే, ఎలాగూ తెగే వరకు వచ్చింది కాబట్టి ఈవిషయంలో కేంద్రం వద్దే తేల్చుకునేందుకు ఇరు రాష్ట్రాలూ సిద్ధమయ్యాయి. అధికారుల స్థాయిలో ఇప్పటికే జరిగిన పంచాయతీలో ఏమీ తేలలేదు.
ఇరు పక్షాలు పట్టు బిగించాయి. దీంతోకేంద్రం ఇప్పుడు ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి తేల్చేసేందుకు ముహూర్తం సిద్ధం చేసింది. వాస్తవానికి ఈనెల 8నే ఈ పంచాయితీ జరగాల్సి ఉన్నప్పటికీ.. సీఎం కేసీఆర్ అభ్యర్థనలతో ఈ డేట్‌ను ఈ నెల 20కి అంటే గురవారానికి వాయిదా వేశారు. మరి ఇరువురుసీఎంలు ఏం చేస్తారో చూడాలి.