వైసీపీ పాలనపై, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని.. అక్రమాలు, అత్యాచారాలు పెరిగాయని రుద్రరాజు విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెప్పారు ఆ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేసేలా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జి మెయ్యప్పన్, ఏఐసీసీ కార్యదర్శి సిరివెళ్ల ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.