ఏపీలో పాల రాజకీయం రాజుకుంటోంది. అమూల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని సహకార డెయిరీలను ఏకతాటి మీదకు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నట్టు కన్పిస్తోంది. పాడి రైతులకు మేలు చేసే ఉద్దేశ్యంతో కాకుండా.. ప్రభుత్వం కొందర్ని టార్గెట్ చేసుకుంటోందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకట్రెండు డెయిరీలకు సంబంధించి త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమూల్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అమూల్ ను లాంఛ్ చేయడం ద్వారా పాడి రైతులకు లబ్ది చేకూరుస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇదంతా కక్ష పూరిత రాజకీయం అనేది ప్రతిపక్షాలు.. సహకార, ప్రైవేటు డెయిరీల వాదన. ఏకంగా విపక్ష నేత చంద్రబాబుకు హెరిటేజ్ పాల వ్యాపారం ఉండడంతో రాష్ట్రంలో రాజకీయం కాక పుట్టిస్తోంది. మొత్తంగా ఏపీలో వివిధ డెయిరీలు సేకరిస్తున్న పాలు.. పాడి రైతుల సొంత వినియోగం కూడా అయిపోయాక సుమారు రెండు కోట్ల లీటర్లకు పైగా పాలు మార్కెట్ సర్‌ప్లస్ ఉందని.. ప్రభుత్వం మార్కెట్‌లో సర్‌ప్లస్ గా ఉన్న పాల సేకరణ పైనే దృష్టి సారిస్తామని అంటోంది. అలాగే అమూల్ ప్రాజెక్టు వల్ల పాల మార్కెట్టులో పోటీ వాతావరణ పెరిగి పాడి రైతులకు లాభం చేకూరుతుందనేది ప్రభుత్వ వాదన.
అయితే ఇదంతా ప్రభుత్వం చెబుతున్న కట్టుకథ మాత్రమేననేది టీడీపీ చేతిలో ఉన్న సహకార, ప్రైవేటు డెయిరీల వాదన. రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఏపీకి అమూల్ ప్రాజెక్టును తెచ్చిందని అంటున్నారు. దీని కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల మేర మౌలిక సదుపాయాలను.. ఆస్తులను అప్పన్నంగా అమూల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతోందని అంటున్నారు. ఇంత చేసినా.. అమూల్ సంస్థ గుజరాత్‌లో పాడి రైతులకిచ్చే ధరకు.. ఏపీలో పాడి రైతులకిచ్చే ధరకు చాలా వ్యత్యాసం ఉందని లెక్కలతో సహా వివరిస్తున్నాయి.
ముఖ్యంగా హెరిటేజ్, సంగం, విజయ వంటి డెయిరీలను టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసుకుంటోందనే భావన వ్యక్తమవుతోంది. ఫెడరేషన్ నుంచి మాక్స్ చట్టానికి మారినా.. మాక్స్ నుంచి ప్రొడ్యూసర్స్ కంపెనీకి మారిన అంతా పక్కా నిబంధనల ప్రకారం.. పాడి రైతుల అంగీకారంతోనే చేపట్టామని వివిధ డెయిరీలు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తాము ఎలాంటి విచారణకైనా సిద్దమని సంగం డెయిరీ ప్రకటించింది.
సహకార డెయిరీలు.. పాడి రైతులతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధమైంది సంగం డెయిరీ. ఇక అమూల్ సంస్థ కోసం క్షేత్ర స్థాయిలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థలను వాడేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. చేయూత స్కీమ్ ద్వారా డబ్బులిచ్చి అమూల్ సంస్థకే పాలు పోయాలని ఒత్తిడి తెస్తోన్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.