ఏపీలోని చైనా కంపెనీలపై కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర సర్కార్ నివేదిక పంపింది. మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాయన్న అనుమానాలతో ఏపీలోని 4 కంపెనీలపై ఏపీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) విచారణ పూర్తి చేసింది. చైనా నుంచి పెట్టుబడులు.. వాటితో ఏర్పాటు చేసిన కంపెనీల్లో ఆ దేశీయులతోపాటు స్థానికంగా ఉన్న కొందరిని డమ్మీ డైరెక్టర్లుగా చూపుతూ 2017 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆర్‌వోసీ అనుమానించింది. ఆయా కంపెనీల దస్త్రాలను పరిశీలించి.. నివేదికను కేంద్ర కార్పొరేట్ మంత్రిత్వ వ్యవహారాలశాఖకు (ఎంసీఏ) పంపింది.
ఒక కంపెనీ కార్యకలాపాలు సక్రమంగా ఉన్నాయని, మరో మూడు కంపెనీలు అసలు లావాదేవీలే నిర్వహించలేదని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అలీబాబా ప్రాజెక్ట్స్ డాట్ కామ్ (అమలాపురం), అలీబాబా కామర్స్ డిజిటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తిరుపతి), డెన్సిటింగ్ ప్రెసిషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (విశాఖపట్నం), సీఈటీసీ రెన్యువబుల్ ఎనర్జీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (తిరుపతి జిల్లా, శ్రీసిటీ) కంపెనీల లావాదేవీలు, ఇతర చెల్లింపులపై ఆర్‌వోసీ విచారణ నిర్వహించింది.