మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇక నుంచి రాష్ట్రంలో రాత్రి 9 గంటల వరకు వైన్ షాపులు తెరిచే ఉండనున్నాయి. ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుస్తుండగా, తాజాగా మరో గంట పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజువారీ అమ్మకం వివరాలు నమోదు చేసేందుకు, నగదు లెక్కింపుకు సమయం సరిపోవట్లేదని, అందుకే గంట సమయం పెంచుతున్నట్లు సర్కారు తెలిపింది.
అయితే సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మద్యం నియంత్రణపై పూర్తిగా దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రజలు రోడ్లపైనే ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ‘జే టాక్స్’ వసూళ్ల కోసం పరితపిస్తున్నారని విమర్శించారు. మద్యం దుకాణాలు రాత్రి 9 వరకు తెరిచి ఉంచాలన్న ఆదేశాలు దుర్మార్గమని మండిపడ్డారు.