విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ ఉన్నతాధికారి భార్యను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఆమె వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం కస్టమ్స్‌కు అప్పగించారు. నిందితురాలిని ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సీఈవో రేగుళ్ల మల్లికార్జునరావు భార్య నీరజారాణిగా గుర్తించారు.
షార్జా నుంచి 38 మంది ప్రయాణికులతో ఐఎక్స్ 536 ఎయిర్ ఇండియా విమానం గురువారం సాయంత్రం విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది. అందులో గన్నవరం వచ్చిన నీరజారాణి తనతో పాటు కిలో బంగారు ఆభరణాలను తీసుకొచ్చారు. దుబాయ్‌లో ఆమె బంగారు ఆభరణాల దుకాణాన్ని నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారుల బృందం హైదరాబాద్ నుంచి ముందే విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది.
షార్జా నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా నీరజారాణి వద్ద కిలో బంగారు ఆభరణాలు లభించాయి. గురువారం సాయంత్రమే ఈ ఘటన జరిగినా శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఈ విషయం బయటకు రానీయకుండా గోప్యంగా ఉంచారు.