ఆ సీనియర్‌ మంత్రిలో అసంతృప్తికి కారణం ఇదేనా…?

-

పేరుకి సీనియర్ మంత్రే ఎక్కువగా తన స్వంత నియోజకవర్గానికే పరిమితం అవుతారు. వివాద రహితుడిగా పేరుంది. అయితే ప్రజాప్రతినిధిగా అందరి వాడిగా ఉండాల్సిన మంత్రి కొందరి వాడే అయ్యారనే విమర్శలు పెంచుకుంటున్నారట.సీనియర్ మంత్రి అయినప్పటికి జిల్లాలో మిగిలిన ఇద్దరు మంత్రులు కురసాల కన్నబాబు, వేణుగోపాల కృష్ణ లతో పోలిస్తే కొంచెం దూకుడు తక్కువ. ఆయనే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం శాసన సభ్యులు… రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.

విశ్వరూప్ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కాబినెట్ లో మంత్రిగా అందరి అభిమానాలు పొందారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవిని పొందిన విశ్వరూప్ తన పేరును నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సీనియర్ అయినప్పటికీ తగిన శాఖ లభించలేదని లోలోపల మథన పడుతున్నారనే టాక్ ఉంది. అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ విజయంలో శెట్టిబలిజ సామాజిక వర్గంతో పాటు. దళితులు ప్రముఖ పాత్ర పోషించారు. అయితే మంత్రి గా విశ్వరూప్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారనే వాదనలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో దళితులలో అసంతృప్తి ఉంది. శెట్టిబలిజలతో సమానంగా పార్టీలోని దళిత నాయకులకు ప్రాధాన్యత లభించడం లేదనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.

అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనూరాధ… మంత్రి విశ్వరూప్ మధ్య సఖ్యత లేకపోవడంతో కొంత మంది నాయకులు ఇద్దరి మధ్య ఇబ్బందిపడుతున్నారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు తప్ప అభివృద్ధికి నిధుల వ్యయం జరగడం లేదని ప్రజల్లో అసంతృప్తి కూడా ఉంది. మరోపక్క అమలాపురంలో అంబేద్కర్‌ విగ్రహం విశ్వరూప్‌ కి తలనొప్పిగా మారిందనే టాక్‌ ఉంది. ఇక అమలాపురం స్థానిక సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అటు అమలాపురం నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నా, అభివృద్ధి పనులకు మాత్రం నిధుల కొరత కనిపిస్తోంది.

ఓవరాల్ గా శాఖపై అసంతృప్తితో పాటు, నిధులు లేకపోవటం, స్థానిక సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకోవటం విశ్వరూప్ కి తలనొప్పిగా మారిందనే టాక్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news