ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య అవినాభావ సంబంధం ఏర్పడినప్పుడు.. దానిని ఎంతో జాగ్రత్తగా కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ప్రజలను మీరు.. ఇలా ఉండండి.. అలా ఉండండి.. అని చెబుతున్న వైఎస్సార్ సీపీ నాయకులు.. తాము మాత్రం అలా వ్యవహరించడం లేదనే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో అయినా.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయినా .. ఇలాంటి పరిస్తితే.. వైఎస్సార్ సీపీలో కనిపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఒణికిస్తున్న కరోనా విషయంలో ప్రజలకు.. ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అంతా చేస్తున్నాం.. మీరు అధైర్య పడొద్దని సీఎం జగన్ స్వయంగా చెబుతున్నారు.
అంతేకాదు, ఇటీవల కొవిడ్ ఆస్పత్రుల్లో ఏర్పాట్లపైనా ఆయన చర్చించారు. ఏర్పాట్లు పెంచాలన్నారు. ప్రజలు ఆస్పత్రులకు వచ్చి చేరాలని కూడా పిలుపు ఇస్తున్నారు. మరి ఇంత చేస్తుంటే.. మంత్రులు, కీలక నేతలు చేస్తున్న వ్యవహారాలు ప్రజల్లో నమ్మకం పోయేలా చేస్తున్నాయనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. కరోనా పాజిటివ్ వచ్చిన అధికార పార్టీకి చెందిన వారు మాత్రం ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. అంతకుముందు కరోనా బారినపడిన ఉపముఖ్యమంత్రి అంజా ద్ బాషా తిరుపతిలోని స్విమ్స్ నుంచి హుటాహుటిన ‘డిశ్చార్జి’ చేయించుకుని హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చే రారు.
రాష్ట్ర మంత్రి ఒకరు కరోనా వచ్చినట్లు సందేహం రాగానే హైదరాబాద్‌కు వెళ్లి, ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని వచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, అన్నీతానై నడిపిస్తున్న రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కూడా అటు విశాఖలో, ఇటు విజయవాడలోని ఏ ఆస్పత్రిలో చేరకుండా… హైదరాబాద్ అపోలోలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. మాకేమో.. ప్రభుత్వ వైద్య శాలల్లో చేరమని చెప్పి.. మీరెళ్లి పక్కరాష్ట్రాల్లో ఎలా చేరతారని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామం.. పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది.