ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు ఏపీ శకటం ఎంపికైంది. కోనసీమలో ప్రబల తీర్థం పేరుతో సంక్రాంతి ఇతివృత్తంగా రూపొందించిన శకటం రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొననుంది. కాగా దక్షిణ భారత దేశం నుంచి ఏపీతో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. ఈ విషయంపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో, సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది.
వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పరేడు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 71వ గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వ కళారూపాలు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ…ఆకర్షణీయంగా రూపొందించిన ప్రగతిరథం రాజ్‌పథ్‌లో కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది.