ఏపీలో అధికార వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా… ఆయన ప్రజల్లో ఇప్పటకీ ఇమేజ్ ఎంత మాత్రం చెక్కు చెదరకపోయినా కొందరు పార్టీ నేతల తీరుతో అటు జగన్‌కు, ఇటు పార్టీకి సామాన్య ప్రజలు, న్యూట్రల్ పర్సన్స్‌లో డ్యామేజ్ జరుగుతోంది. పార్టీ నేతల్లో కొందరు దూకుడుగా ముందుకు వెళ్లడంతో పాటు వారు వాడుతోన్న భాష, పదజాలం ఇప్పట్లో పార్టీ పట్ల వ్యతిరేక భావం ఏర్పడడానికి కారణమవుతోందని పలువురు అంటున్నారు. రాజకీయ విశ్లేషకుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షాలకు ఘాటైన కౌంటర్లు ఇవ్వాలి… ఇవ్వడంలో తప్పులేదు కూడా..! అయితే కొందరు వైసీపీ నేతలు మితిమీరిన భాష వాడుతున్నారు. ఇదే ఇప్పుడు జగన్‌కు, పార్టీకి ఇబ్బంది అవుతోంది.
వైసీపీ నుంచి ఘాటైన వ్యాఖ్యలు చేసే వారిలో కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. ఆయన చంద్రబాబు, టీడీపీ, లోకేష్ పేరు చెపితే ఎంత తీవ్రంగా విరుచుకు పడతారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు వైసీపీకి కూడా చంద్రబాబు, టీడీపీలోని ఓ సామాజిక వర్గ నేతలను తిట్టేందుకు అస్త్రంగా వాడుకుంటోంది. అయితే నాని వాడుతోన్న భాష వైఎస్సార్సీపీకి ప్లస్ కంటే మైనస్సే ఎక్కువ అవుతోంది. ఈ భాష వల్లే ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వాన్ని తప్పు పట్టే పరిస్థితి ఉంది. ఇక బొత్స సత్యనారాయణ రాజధానిపై చేసిన కామెంట్లను ఇప్పటకీ అక్కడ ప్రజలు తప్పుపట్టే పరిస్థితి ఉంది.
పైగా బొత్స రాజధాని ప్రాంతంలో పర్యటిస్తే స్మశానంలో నీకేం పని అక్కడ వాళ్లు ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఇక మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఇటీవల ప్రతిపక్షాలను విమర్శించే సమయంలో సంయమనం, సహనం కోల్పోతున్నట్టే ఆయన వాడుతోన్న భాష చూస్తే తెలుస్తోంది. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు లాంటి వాళ్లు కూడా ఇంటర్వ్యూలలో తీవ్రమైన భాష వాడి విమర్శల పాలయ్యారు. ఇలాంటి నేతల తీరుతోనే ఫైనల్‌గా జగన్, పార్టీకి పెద్ద మైనస్ అవుతోన్నట్టే కనిపిస్తోంది. మరి జగన్ లేదా వైసీపీని కంట్రోల్ చేస్తోన్న కీలక నేతలు అయినా ఇలాంటి వారి భాషను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.