జమ్మూ కాశ్మీర్ లో ఈ మధ్య కాలంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఉగ్రవాదుల దాడులు.. మరో వైపు రోడ్డు ప్రమాదాలు, మంచు ప్రమాదాలు ఇలా జవాన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని బందిపూర్ జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాశ్మీర్ లోయలో ఇలా ఆర్మీ వాహనాలు ప్రమాదానికి గురి కావడం ఇదేమీ తొలిసారి కాదు. గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనం అదుపుతప్పి 350 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ఉగ్రకోణం లేదని ఆర్మీ స్పష్టం చేసింది. అంతకుముందు నవంబర్ 4న రాజౌరి జిల్లాలో వాహనం స్కిడ్ అయి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆర్మీ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు.