హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లీమిన్ (ఎంఐఎం) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. దేశంలో వివిధ రాష్ట్రాల్లో తమకు బలం ఉన్న చోట పార్టీని మరింత బలపరిచేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బలం పెంచుకుంది. హైదరాబాద్ తరువాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎంపీ సీటును కూడా కైవసం చేసుకుంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంఐఎం సత్తా చాటింది. 2019 ఎన్నికల్లో బీహార్ లో ముస్లీం మెజారిటీ ఎక్కువగా ఉండే పూర్వాంచల్ రీజియన్ లో 5 అసెంబ్లీ సీట్లను కూడా కైవసం చేసుకుంది. కర్నాటక లో కూడా ఎంఐఎం పార్టీ బలం పెంచుకుంది.
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎంఐంఎం పార్టీ రాజస్థాన్ పై ద్రుష్టి పెట్టింది. త్వరలోనే తమ పార్టీని రాజస్థాన్ లో ప్రారంభిస్తామని ఎంఐంఎం లీడర్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. రానున్న నెలనెలన్నరలో పార్టీని ప్రారంభిస్తామని జైపూర్ లో ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించారు.