తెలంగాణ రాష్ట్ర శాసన సభ నిరవధిక వాయిదా పడింది. ఈ నెల 7వ తేదీ న ప్రారంభం అయిన బడ్జెట్ సమావేశాలు నేటి వరకు జరిగాయి. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగాయి. అందులో ఎలాంటి అవంతరాలు లేకుండా.. 54 గంటల 47 నిమిషాలు పాటు శాసన సభ జరిగింది. కాగ నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టారు. దీంతో శాసన సభ్యుల అందరి అనుమతితో ద్రవ్య వినిమయ బిల్లుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపారు.
దీంతో ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు శాసన సభ ఆమోదం లభించింది. కాగ ద్రవ్య వినిమయ బిల్లు ను శాసన సభ ఆమోదం తెలిపిన తర్వాత.. సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరవధిక వాయిదా వేశారు. కాగ ఈ సారి అసెంబ్లీ సమావేశాలు వివాదాల మధ్యే ప్రారంభం అయింది.
చివరి సారి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలను నిరవధిక వాయిదా వేయలేదని.. గత సమావేశాలను కొనసాగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే.. ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ కూడా రాష్ట్రంలో కొంత వరకు వివాదానికి కారణం అయింది.